Kharadar blast : పాకిస్థాన్‌ క‌రాచీలో పేలుడు.. ఒక‌రు మృతి, ప‌లువురికి గాయాలు..

పాకిస్థాన్ లో మళ్లీ బాంబు పేలుడు సంభవించింది. కరాచీ సమీపంలో ఉండే  ఖరదర్ ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. 

Kharadar blast: An explosion in Karachi, Pakistan .. One killed, several injured ..

పాకిస్థాన్‌ కరాచీలోని ఖరదర్ ప్రాంతంలో పేలుడు సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందారు. ఈ పేలుడు సోమ‌వారం రాత్రి చోటు చేసుకుంది. ఇందులో ఓ పోలీసు ఆఫీసర్ తో పాటు దాదాపు 12 మంది వ్యక్తుల‌కు గాయాలు అయ్యాయి. 

ఈ ప్ర‌మాదం విష‌యం తెలియ‌గానే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటనా చేరుకున్నారు. గాయ‌ప‌డిన వారిని హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. అయితే ఈ పేలుడు కోసం దుండ‌గులు మోటారు సైకిల్ లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)ని అమర్చినట్లు పోలీసులు క‌నుగొన్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పేలుడు వ‌ల్ల ఏర్ప‌డిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

ప్ర‌స్తుతం పేలుడు జరిగిన ఖరదర్ ప్రాంతం ఎప్పుడూ జ‌నంతో ర‌ద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతం న‌గ‌రంలోనే వ్యాపార కేంద్రంగా ఉంది. ఇక్కడి వ్యాపారులు ఎక్కువ‌గా ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఇత‌ర మెటీరియల్‌ల అమ్మ‌కాలు సాగిస్తార‌ని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘ‌ట‌న విషయంలో కరాచీ అడ్మినిస్ట్రేటర్ ముర్తాజా వాహబ్ మాట్లాడుతూ.. పేలుడు వల్ల ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయ‌ని, వారిని వెంట‌నే సమీపంలోని ఆసుపత్రికి త‌రలించామ‌ని చెప్పారు. ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. 

స‌మాచారం అందిన వెంట‌నే ఘటనా స్థలానికి పోలీసు బృందాలను పంపినట్లు సింధ్ సమాచార మంత్రి షర్జీల్ మెమన్ తెలిపారు. “ పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మాకు మ‌రిన్ని వివ‌రాలు తెలిసిన వెంట‌నే మీడియాకు స‌మాచారం అందిస్తాం ’’ అని ఆయ‌న తెలిపారు. పేలుడుకు గ‌ల నిర్ధిష్ట కార‌ణం ఇంకా తెలియ‌రాలేద‌ని చెప్పారు. 

 

కాగా..  మే 12వ తేదీన సద్దర్ ప్రాంతంలో కూడా బాంబు పేలుడు సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మ‌ర‌ణించారు. 13 మంది గాయాల పాల‌య్యారు. పాకిస్థాన్‌ కోస్ట్ గార్డ్స్ వాహనమే దుండ‌గుల ల‌క్ష్యం అని పోలీసులు చెప్పారు. అయితే ఆ వాహ‌నంలో ఉన్న సిబ్బంది సురక్షితంగా ఉన్నార‌ని పేర్కొన్నారు. కరాచీ యూనివర్శిటీలో ఏప్రిల్ చివరలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ముగ్గురు చైనీస్ బోధ‌కులు, దాని స‌మీపంలో నివ‌సించే ప‌లువురు వ్య‌క్తులు మ‌ర‌ణించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios