మాస్కో: జమ్మూ కాశ్మీర్ విషయంలో రష్యా పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం చేసిన మార్పులు భారత రాజ్యాంగ చట్రానికి అనుగుణంగా ఉన్నాయని అభిప్రాయపడింది. 

సిమ్లా ఒప్పందానికి, లాహోర్ డిక్లరేషన్ కు అనుగుణంగా భారత, పాకిస్తాన్ దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తూ భారత ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. 

జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపత్యంలో ప్రాంతీయంగా ఉద్రిక్త పరిస్థితులు పెరగకుండా పాకిస్తాన్, భారత్ చర్యలు తీసుకుంటాని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో అభిప్రాయపడింది. 

భారత, పాకిస్తాన్ ల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వచ్చేందుకు తాము ఎల్లవేళలా మద్దతు ఇస్తామని తెలిపింది. పాకిస్తాన్, భారత్ తమ మధ్య ఉన్న విభేదాలను రాజకీయ, దౌత్యపరమైన ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పింది.