మాంసం.. రెండు, మూడు రోజులు కూడా నిల్వ ఉండదు. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడేళ్ల కిందటి మాంసం.. అది కూడా కుళ్లిపోయింది.. దానినే కష్టమర్లకు వండి పెడుతోంది ఓ టాప్ రెస్టారెంట్. కంగారుపడకండి.. మన దగ్గర కాదులేండి. పాకిస్థాన్ లో.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ లోని  కరాచీలోని డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ ఏరియాలో ఉన్న అరిజోనా గ్రిల్ రెస్టారెంట్ లో ఓ కుటుంబం భోజనం చేసింది. కాగా.. తల్లి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుండగా.. ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన అక్కడ కలకలం రేపింది.

దీంతో స్పందించిన అధికారులు అప్పటికప్పుడు రెస్టారెంట్ సీజ్ చేశారు. తాజాగా ఆ రెస్టారెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు మరోసారి దాడులు చేశారు. కాగా.. ఆ దాడుల్లో బయటపడిన సంగతులు చూసి అధికారులే షాకయ్యారు. మూడేళ్ల క్రితం నాటి కుళ్లిన మాంసాన్నే కష్టమర్లకు వండిపెడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 80కేజీల కుళ్లిపోయిన మాంసాన్ని అధికారులు సీజ్ చేశారు. 

ఈ కుళ్లిపోయిన ఆహారం తినడం కారణంగానే చిన్నారులకు ఫుడ్ పాయిజినింగ్ జరిగిందని.. అందుకనే వారు చనిపోయారని అధికారులు గుర్తించారు. ఈ మేరకు రెస్టారెంట్ యాజమాన్యం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

related news

రెస్టారెంట్‌లో కలుషిత ఆహారం.. ఇద్దరు బాలురు మృతి, చావుబతుకుల్లో తల్లి