రెస్టారెంట్‌లో కలుషిత ఆహారం తిన్న ఇద్దరు బాలురు మరణించగా.. ఆమె తల్లి చావుబతుకుల మధ్య కొట్టామిట్టాడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం మధ్యాహ్నం పాకిస్తాన్‌ వాణిజ్య రాజధాని కరాచీలోని డిఫెన్స్‌ హౌసింగ్ అథారిటీ ఏరియా ఉన్న అరిజోనా గ్రిల్ రెస్టారెంట్‌కు ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లింది.

అక్కడ భోజనం ఆర్డర్ చేసి తిన్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత వాంతులు, వికారం, కడుపునొప్పితో వారు ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పిల్లలు మరణించగా.. తల్లి వెంటిలేటర్‌పై చావు బతుకులమధ్య కొట్టుమిట్టాడుతోంది.

ఈ విషయం బయటకు పొక్కడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు సదరు రెస్టారెంట్‌లో సోదాలు నిర్వహించి.. సీజ్ చేశారు. అలాగే వారి వాంతులు, రక్తం నుంచి శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు.

మరోవైపు ఈ దుర్ఘటనపై అరిజోనా గ్రిల్ రెస్టారెంట్ యాజమాన్యం స్పందించింది. నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం ఏ రెస్టారెంట్‌ మనుగడకైనా మూలస్తంభాలు.. ఈ మౌలిక సూత్రాన్ని అరిజోనా ఖచ్చితంగా పాటిస్తుంది. ఘటన జరిగిన రాత్రి పోలీసులు తమ రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించి.. ఫుడ్ పాయిజినింగ్ జరిగిందని గుర్తించి హోటల్‌ను సీజ్ చేశారు.

దీని పట్ల తాము తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాము..వారిద్దరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు విచారణ బృందం గడచిన వారం రోజులుగా అరిజోనా రెస్టారెంట్‌లో నమోదైన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తోంది.