అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా ఎంపికైన భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ భారత స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

గడిచిన దశాబ్ధాల్లో భారతదేశం సాధించిన పురోగతి ప్రస్తుతం ప్రతిబింబిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. న్యాయం కోసం చేసిన పోరాటంలో మన ప్రజలు చెప్పుకోదగిన పురోగతి సాధించారు.. మరింత మంచి భవిష్యత్తును నిర్మించడానికి మనమందరం కట్టుబడి ఉందాం.

ఈ సమయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని కమలా హారిస్ ట్వీట్ చేశారు. మరో వైపు అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న జోబిడెన్‌తో కలిసి కమలా హారిస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

దీనిలో భాగంగా ఇండియన్- అమెరికన్ సంఘం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కమలా హారిస్ భారత్‌తో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో అసలైన హీరోలన విజయగాథలను చిన్నప్పుడు చెన్నై బీచ్‌లో నడుస్తూ.. తన తాతగారు చెప్పిన విషయాలను ఆమె గుర్తుచేసుకున్నారు.

అంతేకాకుండా తన తల్లీ శ్యామల చేసిన ఇడ్లీ లాంటి కమ్మని ప్రేమ గుర్తులను కమలా హారిస్ ఈ సందర్భంగా అక్కడి వారితో  పంచుకున్నారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే హెచ్ 1 బీ వీసా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని బిడెన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.