దీపావళి పండుగ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. భారత్ కి రావడం, తన అమ్మమ్మగారింట్లో పండుగ జరుపుకోవడం లాంటి విశేషాలు చెప్పుకొచ్చారు.
వాషింగ్టన్ : దీపావళి సందర్భంగా యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తన తల్లిని గుర్తు చేసుకున్నారు. భారతీయ అమెరికన్ అయిన తన తల్లి అంకితభావం, సంకల్పం, ధైర్యమే తన విజయానికి కారణమని అన్నారు. అమెరికాకు మొదటి భారతీయ సంతతి వైస్ ప్రెసిడెంట్గా హ్యారీస్ భారతీయులందరికీ బాగా పరిచయమే.
"ఆమె అంకితభావం, ఆమె సంకల్పం, ఆమె ధైర్యం కారణంగా నేను యునైటెడ్ స్టేట్స్ కు వైస్ ప్రెసిడెంట్‌గా మీ ముందు నిలబడ్డాను" అని ప్రెసిడెంట్ జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ హోస్ట్ చేసిన వైట్ హౌస్ దీపావళి రిసెప్షన్‌లో చెప్పుకొచ్చారు. దీంట్లో 200 మందికి పైగా ప్రముఖ భారతీయ అమెరికన్లతో జరిగిన సమావేశంలో హారిస్ మాట్లాడుతూ.. తన చిన్నతనంలో తరచూ చెన్నైకి వెళ్లడం, తాతాఅవ్వలతో కలిసి దీపావళి జరుపుకోవడం గుర్తుచేసుకున్నారు.
“దీపావళికి సంబంధించి చిన్నతనంలో నాకు నాకు చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీలో చాలా మందిలాగే, మేమూ వర్షాకాలం నుండి తప్పించుకోవడానికి ప్రతి సంవత్సరం భారత్ కు వెళ్లేవాళ్లం. అదీ దీపావళికి వెళ్లేవారిమి. నేనూ, నా చెల్లి మాయ అర్థరాత్రి నిద్రలేచేవాళ్లం.. మెల్లిగా ఇంటిపెద్ద అయిన మా తాతగారి దగ్గరికి వెళ్లేవాళ్లం. తెల్లారిన తరువాత మా అమ్మ మాకు చిన్న టపాసులు ఇచ్చేది. వాటిని కాల్చడానికి వీధుల్లోకి వెళ్లేవాళ్లం.." అని ఆమె గుర్తుచేసుకుంది.
బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ తుఫాన్ బీభత్సం.. 7 గురు మృతి.. వేలాది మందిపై ప్రభావం..
తన తల్లి 19 ఏళ్ల వయసులో చదువు కోసం అమెరికాకు వచ్చిందని హారిస్ తెలిపారు. "ఆమె తానే స్వయంగా ఇక్కడికి వచ్చింది. రొమ్ము క్యాన్సర్ పరిశోధకురాలు కావడమే ఆమె లక్ష్యం. మన దేశంలో, ఈ దేశంలో, ఆమె తన జీవితాన్ని నిర్మించుకుంది. ఆమె తన PhD సంపాదించింది. తాను ఎంచుకున్న రంగంలో రాణించింది. నన్ను, నా సోదరిని పెంచింది" అంటూ హారిస్ చెప్పుకొచ్చారు.
దీపావళిని "హాలిడే ఆఫ్ హోప్"గా అభివర్ణించిన ఆమె, ఈ పండుగ ప్రపంచంలో, ప్రతొక్కరిలో ఉన్న వెలుగును చూడడానికి సహాయపడుతుంది. "చీకట్లు కమ్మినప్పుడు శాంతి కోసం, న్యాయం కోసం, అవగాహన కోసం పోరాడేందుకు మన లోపలి వెలుగును ప్రకాశింపజేయాలని కూడా గుర్తు చేస్తున్నా".. "ద్వేషాన్ని నాటడానికి, విభజించడానికి విద్వేశ శక్తులు శక్తివంతంగా పని చేస్తున్నప్పటికీ, మనలోపలి కాంతితో ముందుకు పయనించడమే మనలోని కాంతి ఉద్దేశం. దీపావళి అనగానే మనకు గుర్తుకు వచ్చేది అందులో భాగమే. చీకటి క్షణాల్లో, కాంతిరేఖను చూస్తాం ”అని ఆమె చెప్పింది.
ఈ సందర్భంగా హారిస్ మాట్లాడుతూ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సమానత్వం అనే ఆశయాలను ప్రజలు గ్రహించాలని పిలుపునిచ్చారు. హారిస్ శుక్రవారం దీపావళి వేడుకల కోసం తన నివాసంలో 100 మందికి పైగా భారతీయ అమెరికన్లకు ఆతిథ్యం ఇచ్చారు. ఆమె నావల్ అబ్జర్వేటరీ నివాసం మొత్తాన్ని దియాలతో అలంకరించడమే కాకుండా, అతిథులతో చిన్న చిన్న స్పార్కలర్స్ వెలిగించింది.
హారిస్ తరచుగా తన ప్రసంగాలలో తల్లిని గుర్తు చేసుకోవడాన్ని ప్రెసిడెంట్ బిడెన్ ప్రశంసించారు. "నేను కమల గురించి ఎక్కువగా ఇష్టపడే వాటిల్లో ఇదీ ఒకటి.. ఆమె తరచుగా తన తల్లి గురించి మాట్లాడుతుంది," అని అతను చెప్పాడు. శ్రీమతి హారిస్ గత వారం తన పుట్టినరోజును జరుపుకున్నారు. "ఆమెకు 30 ఏళ్లు వచ్చాయి" అని అతిథుల నవ్వుల మధ్య జో బిడెన్ సరదాగా అన్నాడు.
“మీ అమ్మ ఎప్పుడూ, అన్ని సమయాల్లో మీతోనే ఉంటారని మాకు తెలుసు. ఆమె ధైర్యానికి నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. అమెరికాకు రావాలని ఇక్కడ సెటిల్ కావాలని అనుకునేవారికి మార్గదర్శకత్వంగా ఉంటుంది”అని జో బిడెన్ అన్నారు. "అవకాశాల స్థానంలో ఈ దేశానికి ఏకైక స్థానం ఉందనే ఆలోచనను ఎంచుకుని, అన్నింటినీ విడిచిపెట్టడానికి త్యాగం చేయడం చాలా అద్భుతంగా ఉంది," అన్నారాయన. నవంబర్ 2016 చివరలో వైస్ ప్రెసిడెంట్స్ నేవల్ అబ్జర్వేటరీలో తాను హోస్ట్ చేసిన చివరి ఈవెంట్‌లలో ఒకటి దీపావళి అని జో బిడెన్ గుర్తు చేసుకున్నారు.
