Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోరమైన చలి.. 150 మంది మృతి, 70 వేల పశువుల మృత్యువాత‌

Kabul: ఆఫ్ఘనిస్తాన్‌లో చ‌లి చంపేస్తోంది. ఎముక‌లు కొరికే చ‌లి, చాలా మందికి సరిపడా తిండి దొర‌క‌ని ప‌రిస్థితుల మ‌ధ్య ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇక్కడ లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.
 

Kabul : Deadly cold in Afghanistan: 150 people died, 70 thousand cattle died
Author
First Published Jan 25, 2023, 1:04 PM IST

Deadly cold in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో చలి కారణంగా చాలా మందికి సరిపడా ఆహారం కూడా దొరకడం లేదు. తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇక్కడ లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఎముక‌లు కొరికే చ‌లి, తిండి దొర‌క‌ని ప‌రిస్థితుల మ‌ధ్య ఆఫ్ఘ‌నిస్తాన్ లో 150మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌తికూల వాతావ‌ర‌ణం మ‌ధ్య 70 వేల పశువులు మృత్యువాత ప‌డ్డాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

వివ‌రాల్లోకెళ్తే.. చల్లటి వాతావరణం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ లో దాదాపు 150 మంది మరణించారని నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వం సైతం ఈ విష‌యాన్ని ధృవీకరించింది. మరణాల సంఖ్యను ధృవీకరిస్తూ, రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ..  దశాబ్దంలో అత్యంత తీవ్రమైన చలికి 70,000 పశువులు కూడా మరణించాయని తెలిపిన‌ట్టు ఆ దేశ మీడియా నివేదించింది. అయితే, ఈ మ‌ర‌ణాల సంఖ్య మ‌రింత ఎక్కువ‌గానే ఉండే అవ‌కాశ‌ముంద‌ని అన‌ధికారిక రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

ఆక‌లితో అల‌మ‌టిస్తున్న లక్షలాది మంది..

చలి మధ్యలో చాలా మందికి సరిపడా తిండి కూడా దొరకని ప‌రిస్థితులు ఉన్నాయి.  తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి ఆఫ్ఘ‌నిస్తాన్ లో లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న సహాయక చర్యను కూడా తాలిబన్లు అడ్డుకుంటున్నారు. అందుకే చలితో పాటు ఆకలి వల్ల కూడా చాలా మంది చనిపోయే అవకాశం ఉందని నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ఇప్ప‌టికే వంద‌ల మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్టు వెల్ల‌డిస్తున్నాయి. 

ఆఫ్ఘనిస్తాన్‌లోని చాలా ప్రాంతాలు చ‌లి తీవ్ర‌త‌ను ఎదుర్కొంటున్నాయనీ, ప‌లు ప్రాంతాల్లో మంచు కార‌ణంగా అనేక ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని తాత్కాలిక విపత్తు నిర్వహణ మంత్రి ముల్లా మహ్మద్ అబ్బాస్ అఖుంద్ తెలిపారు. ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో చిక్కుకున్న వారిని రక్షించ‌డానికి  మిలటరీ హెలికాప్టర్లను పంపారు, కానీ అవి చాలా పర్వత ప్రాంతాలలో ల్యాండ్ కాలేదు. ఆఫ్ఘన్‌లు, వారి పశువుల మరణాల సంఖ్య పెరుగుతుండడం పట్ల తాను ఇప్పటికీ ఆందోళన చెందుతున్నట్లు అఖుండ్ చెప్పారు.

మంచు కార‌ణంగా రాక‌పోక‌ల‌కు అంత‌రాయం.. 

దేశంలోని ప‌లు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ మంచు కార‌ణంగా ర‌వాణా వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతోంది. తీవ్ర‌మైన‌ చలి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిలో గొర్రెల కాపరులు లేక గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారే ఎక్కువగా ఉన్నారని మంత్రి తెలిపారు. వారికి వైద్యసేవలు అందుబాటులో లేవని కూడా పేర్కొన్నారు. దీంతో ప‌రిస్థితులు మ‌రింత దారుణంగా మారుతున్నాయ‌ని తెలిపారు. "ఇప్పటికీ పర్వత ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల గురించి మేము ఆందోళన చెందుతున్నాము. మంచు కారణంగా పర్వతాల గుండా వెళ్ళే చాలా రహదారులు మూసివేయబడ్డాయి. కార్లు అక్కడ చిక్కుకుపోయి, గడ్డకట్టే ఉష్ణోగ్రతలలో ప్రయాణికులు మరణించారు" అని తెలిపారు.

ఎన్నడూ లేనంతగా చలిగాలులు

గత నెలలో ఆఫ్ఘన్ మహిళలు సహాయ సంస్థలలో పని చేయకుండా నిషేధిస్తూ తాలిబాన్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుతో ఈ సంవత్సరం సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. జ‌నవరి ప్రారంభంలో ఉష్ణోగ్రతలు మైనస్ 28 డిగ్రీల సెల్సియస్ (మైనస్ 18 ఫారెన్ హీట్) కు పడిపోయాయి. ఈ సమయంలో దేశవ్యాప్త సగటు 0 నుండి 5 డిగ్రీల సెల్సియస్ కంటే చాలా తక్కువగా ఉంద‌ని వాతావ‌ర‌ణ నివేదిక‌లు పేర్కొంటున్నాయి. మహిళా ఎన్జీవో కార్యకర్తలపై తాలిబన్ల నిషేధం తర్వాత దేశంలో పంపిణీ చేస్తున్న పరిమిత మొత్తంలో మానవతా సహాయం ఈ ప్రభావాన్ని మరింత దిగజార్చింది. సుమారు 565,700 మందికి దుప్పట్లు, ఆశ్రయం వంటి సహాయాన్ని అందిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (యునోచా) ఆదివారం ట్విట్టర్లో తెలిపింది. అయితే కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా చలిగాలులు వీస్తున్న నేపథ్యంలో ఇంకా చాలా అవసరమని తెలిపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios