Kamala Harris: అమెరికా అధ్యక్ష బరిలో కమలా హ్యారిస్.. యూఎస్ ప్రెసిడెంట్ కావాలంటే చేయాల్సిందిదే!
Kamala Harris: అమెరికా అధ్యక్ష బరి నుంచి జో బైడెన్ తప్పుకుంటూ, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను డెమోక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా మద్దతు ప్రకటించారు. తన మిగిలిన పదవీకాలంలో దేశానికి సేవ చేయడంపై దృష్టి సారిస్తానని తెలిపారు. కమలా హారిస్ నాయకత్వంపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు.
అమెరికాలో ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవల ట్రంప్‌పై హత్యా యత్నంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ట్రంప్ గాయపడగా.. హత్యా రాజకీయాలకు అమెరికాలతో తావులేదని అధ్యక్షుడు జో బైడెన్ సహా ఆ దేశ నేతలందరూ ఖండించారు. ప్రపంచ దేశాల అధినేతలు సైతం ఈ ఘటనను ఖండించారు.
ఇక, అధ్యక్ష రేసులో తొలి నుంచి తడబాట్లతో వెనుకబడి ఉన్న జో బైడెన్‌పై సొంత పార్టీ డెమోక్రాటిక్ మిత్ర పక్షాల నుంచే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన ప్రసంగాలు, డిబేట్లలో తప్పులు దొర్లడం, దీటుగా గళం వినిపించలేకపోవడంతో ఆయన ప్రెసిండెట్ కేండిడేట్ పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో తాను అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం రాత్రి ప్రకటించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
వచ్చే ఏడాది (2025) జనవరి వరకు ప్రెసిడెంట్ పదవీ కాలం ఉన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా తన బాధ్యతలు నిర్వర్తించడంపై దృష్టి పెడతానని బైడెన్ తెలిపారు. దేశానికి సేవ చేయడమే తనకు గౌరవమని పేర్కొన్నారు.
ఇక, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి నామినీగా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌కు మద్దతు పలికారు జో బైడెన్. ‘‘నా తోటి డెమోక్రాట్లారా, నా నామినేషన్‌ను ఆమోదించకూడదని, నా మిగిలిన పదవీకాలానికి అధ్యక్షుడిగా నా విధులపై నా శక్తియుక్తులను కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నాను. 2020లో పార్టీ అభ్యర్థిగా నా మొదటి నిర్ణయం కమలా హారిస్‌ని ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేయడం. ఇది నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం. ఈ సంవత్సరం కమల మా పార్టీ అభ్యర్థిగా ఉండేందుకు నేను పూర్తి మద్దతును అందించాలనుకుంటున్నాను. డెమొక్రాట్లు కలిసి వచ్చి ట్రంప్‌ను ఓడించాల్సిన సమయం ఇది.’’ అని బైడెన్ పేర్కొన్నారు.
జో బైడెన్ అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటూ.. తనకు అధ్యక్ష అభ్యర్థి నామినీగా మద్దతు పలకడంపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పందించారు. తనకు మద్దతు పలికినందుకు ప్రెసిడెంట్ బైడెన్‌కు ధన్యవాదాలు తెలిపారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఆయన అతివాద ప్రాజెక్టు 2025 ఎజెండాను ఓడించడానికి, డెమోక్రటిక్ పార్టీని, దేశాన్ని ఏకం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు.
‘‘అమెరికా ప్రెసిడెంట్‌గా తన అసాధారణ నాయకత్వానికి, దశాబ్దాలపాటు మన దేశానికి చేసిన సేవలకు జో బైడెన్‌కి అమెరికా ప్రజల తరపున కృతజ్ఞతలు. ప్రెసిడెంట్ ఆమోదం లభించినందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను. అధ్యక్ష ఎన్నికల్లో గెలవడమే నా లక్ష్యం.’’ అని కమలా హారిస్ తెలిపారు.
కాగా, మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన అమెరికా తొలి కమలా హారిస్. నల్లజాతీయురాలు, దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వైస్ ప్రెసిడెంట్ కూడా కమలా హారిసే. ఇప్పుడు అమెరికా అధ్యక్ష అభ్యర్థి నామినీగా బైడెన్ మద్దతు ఆమెకు కలిసొచ్చే అంశం. అయితే, ఆగస్టులో జరిగే డెమోక్రటిక్ జాతీయ సదస్సులో ఆమె అభ్యర్థిత్వానికి డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
కమలా హారిస్ భారతీయ మూలాలున్న అమెరికా మహిళా ఉపాధ్యక్షురాలు కూడా. అమె తల్లి శ్యామలా గోపాలన్ ఇండో- అమెరికన్ క్యాన్సర్ పరిశోధకురాలు. కమలా హారిస్ తండ్రి డొనాల్డ్ జాస్పర్ హారిస్. జమైకన్-అమెరికన్ ఎకానమిస్టు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్.