వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన బైడెన్ కంటతడి పెట్టుకొన్నారు. ఆరోగ్య సిబ్బందితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

కరోనా విధుల్లో ఉన్న ఆరోగ్యసిబ్బందితో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే మిన్నెసోటాకు చెందిన మేరీ టర్నర్ అనే నర్స్ కరోనా రోగులకు చేసిన సేవలను ఆమె గుర్తు చేసుకొన్నారు.  కోవిడ్ రోగులు తమ కుటుంబసభ్యులు, ఆత్మీయుల కోసం పరితపించేవారని ఆమె చెప్పారు.

కోవిడ్ రోగులను ఓదార్చి ధైర్యం చెప్పిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ మాటలు విన్న బైడెన్ భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు.తమ సమస్యలను ఆరోగ్య సిబ్బంది బైడెన్ కు వివరించారు. పీపీఈ కిట్స్ కొరత తీవ్రంగా వేధిస్తోందన్నారు. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించారు. అయితే తానే విజయం సాధించినట్టుగా ట్రంప్ ప్రకటించారు.ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రకటించిన ఎన్నికల అధికారిని ట్రంప్ విధుల నుండి తప్పించారు. ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్టుగా ట్రంప్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.