వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. బైడెన్ తో సుప్రీంకోర్టు జడ్జి జాన్ రాబర్ట్  ప్రమాణం చేయించారు.

బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బరాక్ ఓబామా, బిల్ క్లింటన్, జార్జ్ బుష్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూరంగా ఉన్నారు. 

వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ భవనంలో జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తొలుత అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హరిస్ ప్రమాణం చేశారు. 

ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ రాబర్ట్ అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ తో ప్రమాణం చేయించారు.  

ఈ సందర్భంగా బైడెన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది ఒక వ్యక్తి విజయం కాదన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయంగా ఆయన పేర్కొన్నారు.

ఇది అమెరికా ప్రజలందరి విజయమన్నారు. అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైందన్నారు. సాధించాల్సింది చాలా ఉందని ఆయన నొక్కి చెప్పారు.

కేపిటల్ హిల్ హింసతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందని అందరూ భయపడ్డారు. కానీ అమెరికా ప్రజలు విజయం సాధించారని ఆయన చెప్పారు. అమెరికా పార్లమెంట్ పై దాడిని ఆయన దురదృష్టకరమైందిగా పేర్కొన్నారు.

అమెరికాలో ప్రజాస్వామ్యం బలంగా ఉందన్నారు.అమెరికా అనేక సవాళ్లను ఎదుర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే మన ముందున్న లక్ష్యమని ఆయన చెప్పారు.హింస, ఉగ్రవాదం, నిరుద్యోగం లాంటి సవాళ్లను అధిగమించాలన్నారు. ఈ ప్రయత్నంలో మీ సహకారం కావాలని ఆయన  ప్రజలను కోరారు. దేశాభివృద్దిలో ప్రతి ఒక్క అమెరికన్ సహకరించాలని ఆయన కోరారు.

అందరు అమెరికన్లకు అధ్యక్షుడిగా తాను ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.ఎలాంటి వివక్షకు దేశంలో స్థానం లేదని ఆయన తేల్చి చెప్పారు. అమెరికాను అన్ని విధాలా మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు.

కరోనా నుండి త్వరలోనే బయటపడతామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కరోనా కారణంగా మిలియన్ల ఉద్యోగాలు పోయాయని చెప్పారు. ఈ సమయంలోనే తాను అధ్యక్షుడిగా ప్రమాణం చేయడం చారిత్రకమన్నారు. 

ప్రపంచ యుద్దాలను, ఆర్ధిక సంక్షోభాలను, 9/11 దాడులను అమెరికా చూసిందని ఆయన గుర్తు చేశారు. ఎంత క్లిష్టపరిస్థితులైనా మనం ఓడిపోలేదన్నారు. మంచి ప్రపంచం కోసం పాటుపడుదామని ఆయన కోరారు.