ప్రేమ ఎంత బలమైనదంటే అది గనక ఒకసారి పుడితే ఏదైనా చేస్తుంది.. చేయిస్తుంది. అలా ఓ కుర్రాడితో సముద్రాన్ని ఈదించింది, గడ్డకట్టే మంచులో పయనించేలా చేసింది.. రూల్స్ ను బ్రేక్ చేయించింది... చివరికి అతన్ని జైల్లో పడేసింది.. అదేంటీ అనుకుంటున్నారా? ఇప్పుడీ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు కుర్రాడికోసం నెటిజన్స్ మొత్తం మద్దతు పలుకుతున్నారు. 

ఇంతకీ ఎవరా కుర్రాడు? ఎక్కడ జరిగిందా సంఘటన అంటే.. స్కాట్లాండ్‌కు చెందిన 28 ఏళ్ల డేల్ మెక్‌లాగన్ ప్రేమించిన అమ్మాయి కోసం ఐరీష్ సముద్రాన్ని దాటి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అసలు విషయానికొస్తే.. అతను ప్రేమించిన అమ్మాయి జెస్సికా రెడ్ క్లిఫ్.. ఐరీష్ సముద్రంలోని ‘ఐల్ ఆఫ్ మన్‌’ దీవిలో ఉన్న రామ్సేలో నివాసం ఉంటుంది. 

గత సెప్టెంబర్‌లో తను ఆ దీవిలో పని చేయడానికి వెళ్లినప్పుడు జెస్సికాతో ప్రేమలో పడ్డాడు. అయితే అక్కడ తన కాంట్రాక్ట్ ముగియడంతో తన హోమ్ టౌన్‌కు వెళ్లిపోయాడు. ఇంటికైతే వెళ్లాడు కానీ తన ప్రేయసిని మరిచిపోలేకపోయాడు. దీంతో తీవ్ర విరహానికి గురైన తను ఎలాగైనా ఆమెను చూడాలనుకున్నాడు.

అయితే అధికారులు అతని విజ్ఞప్తులను తిరస్కరించారు. దీంతో ఓ బోటు కొనుక్కుని  ఐరీష్ సముద్రంలో రామ్సేకి చేరుకున్నాడు. 25మైళ్ల ప్రయాణాన్ని 40 నిమిషాల్లో చేరుకోవచ్చన్న ఉద్దేశంతో బయలుదేరాడు. అయితే ఎప్పుడు నడిపిన అలవాటు లేని కారణంగా అతని ప్రయాణం నాలుగు గంటలకు పైనే సాగింది.  

సముద్రం దాటిన తర్వాత మరో 15 మైళ్లు మంచులో నడిచాడు. చివరకు ప్రేయసి ఇంటికి చేరుకున్నాడు. అయితే ప్రేయసికి ఇదంతా ఏమీ తెలియదు.. తనకోసమే అతను అంత కష్టపడి వచ్చిన విషయం అస్సలు తెలియదు. అతను ఇంకా ఆ ఐలాండ్‌లోనే పని చేస్తున్నాడనుకుంది ఆమె. ఇదంతా గత శుక్రవారం నాటి ముచ్చట. 

తర్వాత రోజు ఇద్దరు కలిసి ఓ నైట్ క్లబ్‌కు కూడా వెళ్లారు. ఈ క్రమంలో పోలీసుల కంట పడటంతో వారు ఆరాతీశారు. అసలు విషయం బయటపడింది. ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు. న్యాయస్థానం ముందు నిలబెట్టారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి.. కోవిడ్ నిబంధనలు పూర్తిగా పక్కన పెట్టి.. మొత్తం నగరాన్ని రిస్క్‌లో పెట్టేలా అతని చర్యలు ఉన్నాయంటూ న్యాయస్థానం మండిపండింది. నాలుగు వారాలపాటు శిక్ష విధించింది. 

ఇదిలా ఉంటే, డేల్‌కు మద్దతుగా సోషల్ మీడియా ముందుకు వచ్చింది. అతని సాహస యాత్రకు సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేస్తూ.. అతన్ని ఆకాశానికెత్తేస్తోంది. రోమియో అంటూ పొగడ్తలతో ముంచేస్తూ.. నైట్ హుడ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.