Asianet News TeluguAsianet News Telugu

చావు లేని జీవితం: ఆ రహస్యాన్ని ఛేదించడానికి అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఇన్వెస్ట్!

అసలు వయసే పెరగకుండా ఉండే రహస్యాన్ని కనుగొనడానికి కుబేరుడు జెఫ్ బెజోస్ పెట్టుబడులు పెడుతున్నారు. బయోలాజికల్ రీప్రోగ్రామింగ్ టెక్నాలజీ ద్వారా జీవకణాలను పునరుజ్జీవింపజేయడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది సాధ్యమైతే ఒక జీవి దేహాన్ని మొత్తం క్రియాశీలకంగా చేయవచ్చు. తద్వారా చావు లేని జీవితాన్ని సాధించుకోవచ్చని చెబుతున్నారు.
 

jeff bezos investing in a company to research live forever
Author
New Delhi, First Published Sep 13, 2021, 7:15 PM IST

న్యూఢిల్లీ: జీవితంలో ఎన్ని ఎగుడుదిగుడులు ఎదురైనా, ఎంత సక్సెస్ సాధించినా, వైఫల్యాలతో కొట్టుమిట్టాడినా, పేద, ధనిక, మతం, జాతి అన్నింటికి అతీతంగా ప్రతి ఒక్కరినీ ఎప్పుడో ఒకప్పుడు చావు పలకరిస్తుంది. ఎంత సక్సెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నా ఏదో ఒకనాడు భూమిలో కలిసిపోవాల్సిందే. అందుకే చరిత్రపొడగునా అన్వేషకులు నిత్యం జీవించడానికి ఏం చేయాలా? అని తపనపడ్డారు. ఈ ఇంటరెస్టింగ్  పాయింట్‌పై సినిమాలూ వచ్చాయి. కోరికలకు అంతం లేదు కాబట్టి, నిత్య యవ్వనంగా ఉండాలని, నూతనొత్తేజంతో వెలుగొందాలని, చావేలేని జీవితం కావాలని సాధ్యం కానివని తెలిసినా ఆశపడటం మనుషుల నైజం. కానీ, ఆ అంతుచిక్కని రహస్యాన్ని ఛేదించి తీరాల్సిందేనని అనుకున్నారేమో అటువైపుగానే అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిసింది. ఆల్టోస్ ల్యాబ్‌లో పెట్టుబడులు పెట్టి యాంటీ ఏజింగ్ ప్రాసెస్ ప్రయోగాలకు దన్నుగా నిలుస్తున్నట్టు తెలిసింది.

ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ ప్రకారం, బయోలాజికల్ రీప్రోగ్రామింగ్ టెక్నాలజీపై ప్రయోగాలు చేస్తున్న ఓ కంపెనీకి బెజోస్ ఆర్థిక అండ ఇచ్చినట్టు తెలిసింది. ఈ టెక్నాలజీతో ల్యాబరేటరీల్లో జీవకణాలను పునరుజ్జీవింపజేయడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది విజయవంతమై పురోగతి సాధిస్తే ఒక జీవి
మొత్తం దేహాన్నీ మళ్లీ యాక్టివ్ చేయవచ్చని కొందరు శాస్త్రనిపుణులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా చావే లేని జీవితాన్ని సాధించుకోవచ్చని చెబుతున్నారు. ఇందులో సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నప్పటికీ అటువైపుగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విషయం చాలా మంది దృష్టిని ఆకర్షిస్తున్నది. అందులోనూ ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ పెట్టుబడి పెడుతున్నారంటే ఆశ చావని మనుషులకు మెరుపు కల ప్రత్యక్షంగా కనిపిస్తున్నట్టవుతున్నది.

ఆ కంపెనీ పేరు ఆల్టోస్ ల్యాబ్. అది ప్రస్తుతం పెద్దస్థాయిలో శాస్త్రజ్ఞులను నియమించుకుంటున్నదని, వారికీ పెద్దమొత్తంలో జీతాలను ఇస్తున్నట్టు తెలిసింది. ఈ కంపెనీ ఒక జీవకణం వయసు ఎలా పెరుగుతుందని కనుగొనడానికి సైంటిస్టులకు పూర్తి స్వేచ్ఛనివ్వనుంది. జీతాలిస్తున్నందుకు కచ్చితంగా ప్రతిఫలం
చూపించాలన్న ఒత్తిడి వారిపై పెట్టబోవడం లేదని సమాచారం.  జెఫ్ బెజోస్ ఒక రంగానికి కట్టుబడి ఉండే మనిషి కాదు. గత జులైలోనే అమెజాన్ సీఈవో సీటు నుంచి దిగినా ఆయన ఉత్తేజం ఏ మాత్రం తగ్గలేదు. బ్లూ ఆరిజిన్ కంపెనీ ద్వారా అంతరిక్షయానం చేశారు. ప్రఖ్యాత వాషింగ్టన్ పోస్టు పత్రికలో ఓనర్షిప్ ఉన్నది. ఇన్సైడర్ పత్రికలోనూ చెప్పుకొదగ్గ పెట్టుబడులు పెట్టారు.

1990వ దశంలో ఓ బుక్ సెల్లర్‌గానున్న బెజోస్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో ముందువరుసలో ఉన్నారు. ఆయన అనేక మైలురాళ్లను దాటారు. తాజా పెట్టుబడులతో ఆయన చావులేని జీవితం లేదా కనీసం సగటు మనిషి ఆయుర్ధాయం కంటే ఎక్కువగా జీవించడానికి దారులు వేసుకుంటున్నారని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios