జపాన్ జనాభా వేగంగా క్షీణించిపోతున్నది. అక్కడ జననాల కంటే మరణాల రేటు రెట్టింపు ఉన్నది. ఈ నేపథ్యంలోనే ప్రధాని సలహాదారు మాట్లాడుతూ, పరిస్థితులు ఇలాగే సాగితే జపాన్ మాయమైపోతుందని వివరించారు.
న్యూఢిల్లీ: జపాన్‌లో జనాభాపరమైన ఆందోళన మొదలైంది. అక్కడ వయోవృద్ధుల సంఖ్య గణనీయంగా ఉండగా.. శిశు జననాల రేటు స్వల్పంగా ఉన్నది. జనన, మరణాల రేటులో వ్యత్యాసం పతాకస్థాయిలో ఉన్నది. జననాలకు రెట్టింపు మరణాల సంఖ్య ఉంటున్నది. దీంతో ఆ దేశం జననాల రేటు పెంచడంపై దృష్టి పెట్టింది. ఈ సందర్భంలోనే జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాకు సలహాదారైన మసాకో మోరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే జపాన్ మటుమాయమైపోతుందని అన్నారు. జననాల రేటు పడిపోవడాన్ని అరికట్టకుంటే అది సామాజిక భద్రత వలయాన్ని, ఆర్థిక వ్యవస్థను పెను ముప్పులోకి తోస్తుందని అభిప్రాయపడ్డారు.
‘మనం ఇలాగే సాగితే.. దేశం కనిపించకుండా పోతుంది’ అని ఆమె టోక్యోలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అన్నారు. జపాన్ ఫిబ్రవరి 28వ తేదీన గతేడాది జననాల సంఖ్యను వెల్లడించింది. అది రికార్డుస్థాయిలో క్షీణించింది. ఈ విషయంపై స్పందిస్తూ ఆమె పై విధంగా అభిప్రాయపడ్డారు.
ఈ పరిస్థితులను ఎదుర్కొనే ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. ఇది భావి పిల్లలపైనా తీవ్రమైన ప్రభావం చూపుతుందని వివరించారు.
గతేడాది జపాన్‌లో జన్మించిన శిశువుల సంఖ్యకు రెట్టింపుగా మరణించిన వారి సంఖ్య ఉన్నది. గతేడాది ఆ దేశంలో సుమారు 8 లక్షల శిశువులు జన్మించగా.. సుమారు 15.8 లక్షల మంది మరణించారు.
Also Read: 13 ఏళ్ల బాలుడితో 31 ఏళ్ల మహిళ శృంగారం, గర్భం దాల్చిన ఆమె ప్రసవం.. జైలు నుంచి విడుదల
అందుకే పిల్లల కోసం, కుటుంబాల కోసం ఖర్చులను రెట్టింపు చేయడానికి జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2008లో జపాన్‌లో 128 మిలియన్ల జనాభా ఉండగా.. ఈ సంఖ్య 124.6 మిలియన్లకు పడిపోయింది. జననాల కంటే మరణాల రేటు గణనీయంగా ఉండటంతో జనాభా దారుణంగా క్షీణిస్తున్నది.
కాగా, ఉన్న జనాభాలో గతేడాది 65 ఏళ్లు, అంతకు పైబడిన జనాభా 29 శాతానికి మించి పెరిగింది. దక్షిణ కొరియా స్వల్ప సంతాన రేటు సమస్యను ఎదుర్కొంటూ ఉంటే.. జనాభా క్షీణత సమస్యను జపాన్ ఎదుర్కొంటున్నది.
ఈ క్షీణత క్రమంగా లేదని మోరి తెలిపారు. ఇది స్ట్రెయిట్ డౌన్ గా ఉన్నదని, ఒక్కసారిగా కిందకు పడి పోయేలా ఈ ధోరణి ఉన్నదని వివరించారు. అంటే.. త్వరలో జన్మించే పిల్లలను అనేక లోపాలతో సతమతం అయ్యే సమాజంలోకి తెస్తున్నట్టుగా అర్థం చేసుకోవా లని అన్నారు. ఎందుకంటే ఆ సొసైటీ సరిగా పని చేయలేదు.
