జపాన్‌లో భారీ భూకంపం.. 7.1 తీవ్రతతో నమోదు.. సునామీ హెచ్చరిక జారీ
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశంలోని క్యుషు ప్రాంతంలోని మియాజాకి ప్రిఫెక్చర్ తీరంలో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది.
జపాన్ దక్షిణ తీరంలో గురువారం తీవ్రమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించినట్లు రికార్డయింది. దీంతో ఈ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4:42 గంటలకు జపాన్‌లోని మియాజాకి సమీపంలో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది.
జపాన్ వాతావరణ సంస్థ ప్రాథమికంగా 6.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదు చేసింది. జపాన్ దక్షిణ ద్వీపం క్యుషు తూర్పు తీరంలో సుమారు 30 కిలోమీటర్ల (18.6 మైళ్లు) లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉంది. ఫలితంగా క్యుషు దక్షిణ తీరం, సమీపంలోని షికోకు ద్వీపం వెంబడి 1 మీటర్ (3.3 అడుగులు) వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని సునామీ హెచ్చరిక జారీ అయింది. మియాజాకి, కొచ్చి, ఓయిటా, కగోషిమా, ఎహైమ్ ప్రిఫెక్చర్‌ల తీర ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండేవారు సముద్ర తీరాలకు దూరంగా ఉండాలని సంబంధిత అధికారులు హెచ్చరించారు.
జపాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ నేపథ్యంలో శక్తివంతమైన భూకంపాలను తట్టుకునేలా కఠినమైన నిర్మాణ నిబంధనలను ఆ దేశం కలిగి ఉంది. సుమారు 125 మిలియన్ల జనాభా కలిగిన జపాన్... ప్రతి సంవత్సరం దాదాపు 1,500 భూకంపాలు చవిచూస్తుంది. వీటిలో చాలా వరకు చిన్నవి. అయితే, భూకంపం తీవ్రతను బట్టి నష్టం ఉంటుంది.
ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల రోజే జపాన్‌లో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని నింపింది. 1 జనవరి 2024న సాయంత్రం 04:10 గంటల సమయంలో జపాన్‌లోని ఇషికావా ప్రిఫెక్చర్‌లోని నోటో ద్వీపకల్పంలో ఉన్న సుజుకు ఉత్తర-ఈశాన్యంగా 6 కిలోమీటర్ల దూరంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపంతో పాటు సునామీ రావడంతో నోటో ద్వీపకల్పంలో సుజు, వాజిమా, నోటో, అనామిజు పట్టణాలను విధ్వంసం సృష్టించింది. పొరుగున ఉన్న టోయామా, నీగాటాలోనూ అపార నష్టం జరిగింది. భవనాలు కుప్పకూలి 300 మందికి పైగా మరణించారు.
అంతకు ముందు జపాన్‌లో అత్యంత వినాశకరమైన భూకంపం.. 2011 మార్చి 11న నమోదైంది. 9.0 తీవ్రతతో సముద్రగర్భ భూకంపం సంభవించడంతో సునామీ వచ్చింది. దీంతో సుమారు 18వేల 500 మంది మరణించారు. ఈ విపత్తు కారణంగా ః 112 బిలియన్ల నష్టం ఏర్పడింది. ఫుకుషిమా ప్రాంతం సునామీ మిగిల్చిన నష్టం, గాయాల నుంచి కోలుకోవడానికి దశాబ్దాలు పట్టవచ్చు.