సారాంశం
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ట్రంప్ ప్రమాణ స్వీకారంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ముందు వరుసలో కూర్చున్నారు. ప్రధాని మోదీ లేఖను కూడా ట్రంప్‌కి అందజేశారు.
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ రోటుండాలో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠంపై ట్రంప్ కూర్చోనున్న నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రపంచ దేశాలకు చెందిన ప్రతినిధులు, వ్యాపార దిగ్గజాలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ఇండియాకు అరుదైన గౌరవం దక్కింది.
ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. అన్ని దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరైనా ఈ కార్యక్రమంలో జైశంకర్ కు మొదటి వరుసలోో సీటు కేటాయించారు. ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలకు ప్రతినిధులు వెనకవరుసలో సీటు కేటాయించి భారత్ కు మాత్రం ముందు వరుసలో కేటాయించారు. ఇది ట్రంప్ ప్రభుత్వం భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించాలని భావిస్తున్నట్లు దీన్ని స్పష్టమైన సంకేతంగా భావిస్తున్నారు.
జైశంకర్ ఈక్వెడార్ అధ్యక్షుడు డేనియల్ నోబోవాతో పాటు ముందు వరుసలో కూర్చున్నారు. రెండు వరుసల వెనుక జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ కూర్చున్నారు. జపాన్, ఆస్ట్రేలియాలు క్వాడ్‌లో భాగస్వాములు. ఇందులో భారత్, అమెరికా కూడా ఉన్నాయి.
జైశంకర్ ఎక్స్‌లో ప్రమాణ స్వీకార ఫోటోలను షేర్ చేశారు. "వాషింగ్టన్ డీసీలో అధ్యక్షుడు డోనాల్డ్ జె. ట్రంప్, ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ ప్రమాణ స్వీకారంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా" అని రాసుకొచ్చారు.
నరేంద్ర మోదీ లేఖతో జైశంకర్
జైశంకర్ ప్రధాని మోదీ లేఖను డోనాల్డ్ ట్రంప్‌కి అందజేశారని సమాచారం. ప్రధాని మోదీ ఎక్స్‌లో ట్రంప్‌కి శుభాకాంక్షలు తెలిపి మళ్ళీ కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. ''మై డియర్ ప్రెసిడెంట్ ట్రంప్... యూఎస్ 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తున్న మీకు శుభాకాంక్షలు. మన రెండు దేశాలు (అమెరికా-ఇండియా) బెనిఫిట్ పొందేలా సత్సంబంధాలు కొనసాగిస్తూ ముందుకు వెళదాం... ప్రపంచాన్ని మంచి భవిష్యత్ దిశగా నడిపిద్దాం. మరోసారి మీ అధ్యక్ష జర్నీ సక్సెస్ ఫుల్ గా సాగాలని కోరుకుంటున్నా'' అంటూ పీఎం మోదీ ట్వీట్ చేసారు.
జైశంకర్ ఇతర దేశాల విదేశాంగ మంత్రులతో యూఎస్ క్యాపిటల్‌లో భేటీ అయ్యారు. అలాగే సెయింట్ జాన్స్ చర్చిలో ప్రార్థనలో కూడా జైశంకర్ పాల్గొన్నారు. అక్కడ ఆయన భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామితో మాట్లాడుతు కనిపించారు.