హమాస్ పై ఇజ్రాయెల్ ప్రతీకారం.. గాజా వైపు కదులుతున్న వార్ ట్యాంకులు.. ఇప్పటికే వైమానిక దళం మోహరింపు
ఆకస్మిక దాడితో 400 మందికి పైగా పౌరుల ప్రాణాలు బలిగొన్న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ పై ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు పూనుకుంది. గాజా నుంచి హమాస్ దళాలు తమ కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ యుద్ధ ట్యాంకులు అటువైపు బయలుదేరాయి. అంతకు ముందే వైమానిక దళాన్ని ఆ దేశం మోహరించింది.
ఇజ్రాయోల్ పై ఆకస్మిక దాడికి దిగిన పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు బాధిత దేశం సిద్ధమయ్యింది. గాజా నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సర్వశక్తులను కేంద్రీకరిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ ‘ఐరన్ స్వార్డ్స్’ ను ప్రారంభించి, హమాస్ స్థావరాలను కూల్చివేసేందుకు తన వైమానిక దళాన్ని మోహరించిన ఇజ్రాయెల్.. ఇప్పుడు గాజా స్ట్రిప్లో భారీ గ్రౌండ్ ఆపరేషన్లకు సిద్ధమవుతోంది. గాజా వైపు పలు ట్యాంకులు కదులుతున్నట్లు తాజా విజువల్స్ విడుదలయ్యాయని ‘జీ న్యూస్’ నివేదించింది.
హమాస్ మిలిటెంట్లు శనివారం ఇజ్రాయెల్ లో ఆకస్మిక దాడి చేయడంతో 400 మందికిపైగా మరణించారు. సుమారు 1600 మంది గాయపడ్డారు. అలాగే హమాస్ దళాలు వందలాది మంది ఇజ్రాయెలీలను బందీలుగా తీసుకున్నారు. ఇజ్రాయెల్ లోని కీలక నగరాల్లో మహిళలు, చిన్నారులు, వృద్ధులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
అయితే దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగడంతో 200 మందికి పైగా హమాస్ మిలిటెంట్లు, వారి మద్దతుదారులు హతమయ్యారు. ఈ దాడి అమెరికాలో జరిగిన 9/11 దాడి లాంటిదని, తమను తాము రక్షించుకునే హక్కు తమకు ఉందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇదిలావుండగా.. ఉగ్రవాదులు అపహరణకు గురైన వారికి హాని కలిగిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పూర్తి శక్తితో పనిచేస్తుందని, ఉగ్రవాదుల స్థావరాలను శిథిలాలుగా మారుస్తుందని, గాజాను ఖాళీ చేయాలని ఆయన పౌరులను కోరారు.
ఈ దాడి అపూర్వమని, మరోసారి ఇలా జరగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. హమాస్ సామర్థ్యాలను నాశనం చేయడానికి ఐడీఎఫ్ వెంటనే తన శక్తినంతా ఉపయోగిస్తుందని తెలిపారు. ‘‘మన వారిని నాశనం చేస్తాం. వారు ఇజ్రాయెల్ రాజ్యం, దాని పౌరులపై బలవంతంగా రుద్దిన ఈ చీకటి రోజుకు ప్రతీకారం తీర్చుకుంటాం.’’ అని నెతన్యాహు అన్నారు. హమాస్ మోహరించిన, దాక్కుని, కార్యకలాపాలు సాగిస్తున్న ఆ దుష్ట నగరాన్ని శిథిలాలుగా మారుస్తామని ఇజ్రాయెల్ ప్రధాని అన్నారు. ‘‘నేను గాజా నివాసితులకు చెబుతున్నాను. మేము ప్రతిచోటా బలంగా పని చేస్తాం. కాబట్టి ఇప్పుడే వెళ్లిపోండి. ’’ అని హెచ్చరించారు.
కాగా.. మృతుల కుటుంబాలకు నెతన్యాహు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు, బందీలుగా ఉన్న వారంతా క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సహా ప్రపంచ నేతలు ఇజ్రాయెల్ కు మద్దతు ప్రకటించారు. మరోవైపు ఇజ్రాయెల్ పై దాడిని పాలస్తీనియన్లు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇరాన్, యునైటెడ్ కింగ్ డమ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఆ దేశ జెండాను ఎగురవేసి ఉగ్రదాడిపై సంతోషం వ్యక్తం చేశారు.