Asianet News TeluguAsianet News Telugu

Gaza: గాజాలోని హమాస్ సైట్లపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

ఒకవైపు తాలిబాన్ల అరాచకం కొనసాగుతుండగానే మరోవైపు ఇజ్రాయెల్, గాజా ఘర్షణలు మళ్లీ మొదలయ్యేలా ఉన్నాయి. గాజా స్ట్రిప్ నుంచి హమాస్ ఉగ్రవాదులు తరుచూ ఇజ్రాయెల్ వైపు బెలూన్‌లలో పేలుడుపదార్థాలను నింపి పంపిస్తున్నది. గతవారం ఇలాగే పంపిన బెలూన్‌లు పేలి ఇజ్రాయెల్ వైపున అడవిలో కార్చిచ్చు అంటుకుంది. దీనికి ప్రతిగానే ఇజ్రాయెల్ తాజాగా హమాస్ ఆయుధ తయారీ కేంద్రాలను లక్ష్యం చేసుకుని బాంబుల వర్షం కురిపించింది.
 

israel struck hamas weapon manufacturing centre in gaza strip
Author
New Delhi, First Published Aug 24, 2021, 4:58 PM IST

న్యూఢిల్లీ: ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల దాడులతో తీవ్ర ప్రాణ నష్టం జరుగుతుండగా గాజా స్ట్రిప్‌లో మరోసారి బాంబుల వర్షం కురిసింది. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ అధీనంలోని గాజాలో బాంబులు వేసింది. ముఖ్యంగా హమాస్ ఆయుధాగారాలు, తయారీ కేంద్రాలపై బాంబులు వేసినట్టు ఇజ్రాయెల్ ఆర్మీ మంగళవారం వెల్లడించింది. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సరిహద్దులోకి పంపుతున్న బెలూన్ పేలుళ్లకు ప్రతిగానే దాడి చేసినట్టు తెలిపింది. ఇందులో క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య గొడవ ఈనాటిది కాదు. ఏళ్ల తరబడి ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఘర్షణలు కొనసాగుతున్నాయి. గత మే నెలలో కనీసం 11 రోజులు బాంబుల వర్షం కురిసింది. హమాస్ అధీనంలోని గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి, ఇజ్రాయెల్ నుంచి గాజాపైకి బాంబులు కురిశాయి. ఇందులో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈజిప్ట్ ప్రమేయంతో ఇరుదేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 

ఈ ఒప్పందం కుదిరినప్పటికీ గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై బెలూన్‌లలో పేలుడు పదార్థాలను పంపాయి. ఈ నేపథ్యంలోనే గాజాకు ఎలాంటి సహాయం అందకుండా ఇజ్రాయెల్ కట్టడి చేస్తున్నది. గత వారం సహాయం చేయడానికి ఇజ్రాయెల్ స్వయంగా ఓ ప్రకటన చేసింది. ఇది కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రతిఫలంగా అందరూ భావించారు. కానీ, ఈ ప్రకటన తర్వాత కూడా హమాస్ ఉగ్రవాదులు ఊరుకోలేదు. ఇప్పటికీ అప్పుడో ఇప్పుడో బెలూన్‌ల ద్వారా పేలుళ్లను సాగిస్తున్నారు. గతవారం ఇలాంటి బెలూనే ఇజ్రాయెల్ సరిహద్దులోని అడవిలో కార్చిచ్చుకు కారణమైనట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి.

ఈ బెలూన్‌లకు ప్రతిదాడిగానే తాము బాంబులు ప్రయోగించినట్టు ఇజ్రాయెల్ ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొంది. గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనిస్‌లోని హమాస్ ఆయుధ తయారీ కేంద్రం, జబల్యా టెర్రర్ సొరంగ మారగాన్నీ పేల్చేసినట్టు తెలిపింది. పౌరుల నివాసాలకు సమీపంలోని హమాస్ అండర్‌గ్రౌండ్ రాకెట్ లాంచర్‌ను, శుజయ్యలోని ఓ స్కూల్‌నూ ధ్వంసం చేసినట్టు పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios