ఇరాన్‌లో మాయమవుతున్న మేఘాలు.. ఇజ్రాయిల్‌పై అనుమానాలు

Israel Stolen my Clouds:Iran
Highlights

* ఇరాన్‌పై ముఖం చాటేసిన వరుణుడు
* మేఘాలు మాయమవుతున్నట్లు గుర్తింపు
* ఇజ్రాయెల్ పనేనని ఆరోపణ


 

ఎక్కడ కొన్ని వేల కిలోమీటర్లలో ఆకాశంలో ఆవరించి ఉన్న మేఘాలను ఎవరైనా దొంగిలిచగలరా..? ఈ మాట ఎవరినైనా అడిగితే మనల్ని పిచ్చోళ్లను చూసినట్లు చూస్తారు...? మరికొందరైతే కొట్టినా కొట్టొచ్చు. కానీ ఏకంగా ఒకదేశ ప్రభుత్వం తమ దేశంలోని మేఘాలను దొంగిలిస్తున్నారని ఆరోపిస్తే..నిజంగా అది వింతే కదా..? ఇజ్రాయిల్ తమ దేశంపై ఆవరించివున్న మేఘాలను దొంగిలిస్తోందంటూ ఇరాన్ సంచలన ఆరోపణ చేసింది.

ఇవాళ మీడియాతో మాట్లాడిన ఇరాన్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ జనరల్ గులామ్ రెజా జలాలీ..  గత కొంతకాలంగా దేశంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్ధితులకు కారణాలు అన్వేషించగా.. దీని వెనుక ఇజ్రాయెల్‌ హస్తముందని గులామ్ ఆరోపించారు. ఆ దేశం తమ దేశంపై కమ్ముకున్న మేఘాలను దొంగిలించడంతో పాటు.. ఇరాన్‌వైపు రావాల్సిన మేఘాలను మధ్యలోనే దారి మళ్లిస్తోందంటూ ఆయన ఆరోపించారు..

ఆఫ్ఘనిస్థాన్ నుంచి మధ్యదరా సముద్ర ప్రాంతం వరకు 2,200 మీటర్ల ఎత్తున మంచు పేరుకుపోయి ఉందని.. కానీ ఇరాన్‌పై మాత్రం అది లేదని జలాలీ అన్నారు.. తమ దేశ వాతావరణ పరిస్థితులను మార్చివేసి.. ఇరాన్‌ను ఇక్కట్ల పాలుచేసేందుకు ఇజ్రాయెల్ కుట్ర చేస్తోందని ఆయన అన్నారు.. ఇరాన్ ఆరోపణలు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారి తీశాయి.. మేఘాలను దొంగతనం చేయడం.. దారి మళ్లించడం సాధ్యమేనా అన్న దానిపై కొందరు నెట్టింట్లో పరిశోధనలు మొదలు పెట్టేశారు.

loader