బాంబుల వర్షం.. 40 మంది మృతి.. 800 మందికి పైగా తీవ్ర గాయాలు
Israel: గాజాలోని పాలస్తీనా మిలిటెంట్లు రాకెట్ల వర్షం కురిపించడం, ఇజ్రాయెల్ భూభాగంలోకి ముష్కరులను పంపడంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శనివారం తమ దేశం యుద్ధంలో ఉందని పేర్కొంటూ ఎమర్జెన్సీ ప్రకటించారు. హమాస్ రాకెట్ దాడిలో మృతుల సంఖ్య 40కి పెరిగింది. 800 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
Israel-Palestine: హమాస్ రాకెట్ దాడిలో ఇజ్రాయెల్‌లో మరణించిన వారి సంఖ్య 40కి పెరిగిందని మేగెన్ డేవిడ్ అడోమ్ అత్యవసర సేవలను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ శనివారం నివేదించింది. గాజాలోని పాలస్తీనా మిలిటెంట్లు రాకెట్ల వర్షం కురిపించడం, ఇజ్రాయెల్ భూభాగంలోకి ముష్కరులను పంపడంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శనివారం తమ దేశం యుద్ధంలో ఉందని పేర్కొంటూ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ ఆకస్మిక దాడి దాని పరిమాణం, పరిధిలో ఇటీవలి చరిత్రలో అత్యంత దారుణమైందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 1973 యుద్ధ 50 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
మధ్యాహ్నానికల్లా ఇజ్రాయెల్ లో కనీసం 40 మంది మరణించగా, దాదాపు 800 మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీస్ మాగెన్ డేవిడ్ అడోమ్ (ఎండిఎ) తెలిపింది. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ గాజాలోని హమాస్ స్థావరాలపై దాడులు చేసింది. ఈ హింసలో దాదాపు 200 మంది పాలస్తీనియన్లు మరణించారనీ, 1,610 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది, అయితే మరణాలు ఎక్కడ సంభవించాయి లేదా మృతులలో హమాస్ మిలిటెంట్లు లేదా గాజాలోని పౌరులు ఉన్నారా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. చొరబడిన పట్టణాల నుంచి మిలిటెంట్లను ఏరివేసేందుకు ఆపరేషన్లు జరుగుతున్నాయనీ, రిజర్వ్ మెంటులకు కూడా ఫోన్ చేశామని నెతన్యాహు తెలిపారు.
అక్కడి స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 6:30 గంటలకు ఉగ్రవాదులు గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ లోకి 2,200 రాకెట్ల బ్యారేజీని ప్రయోగించగా, సాయుధ ముష్కరులు సరిహద్దు దాటి దక్షిణ ఇజ్రాయెల్ లోకి చొరబడ్డారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. జెరూసలెం, టెల్ అవివ్, దక్షిణ ఇజ్రాయిల్ లలో అనేక పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కొన్ని పేలుళ్లు రాబోయే రాకెట్లను అడ్డుకునే అవకాశం ఉంది. వైమానిక దాడులతో ఇజ్రాయెలీలు భూగర్భ షెల్టర్లలోకి ప్రవేశించారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. పారాగ్లైడర్లను ఉపయోగించి తమ ఫైటర్లు భూ, సముద్ర, వాయు మార్గాల ద్వారా ఇజ్రాయెల్లోకి ప్రవేశించిన తర్వాత సరిహద్దు సమీపంలో పలువురు ఇజ్రాయెల్ సైనికులను పట్టుకున్నట్లు హమాస్ తెలిపింది.