ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభం.. హమాస్ దాడిలో కేరళ మహిళకు గాయాలు.. భర్తతో వీడియో కాల్ సమయంలో ఘటన..
ఇజ్రాయెల్ లో పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ జరిపిన దాడి వల్ల బాధిత దేశంలో పరిస్థితి ఆకస్మాత్తుగా మారిపోయింది. ఆ దేశంలో ఇతర దేశాలకు చెందిన అనేక మంది పౌరులు చిక్కుకుపోయారు. మన దేశంలోని కేరళ కు చెందిన దాదాపు 300 మంది ప్రజలు ఈ పరిస్థితుల్లో అక్కడి హోటల్స్ లో తలదాచుకున్నారు. కేరళకు చెందిన ఓ మహిళ హమాస్ దాడిలో గాయపడ్డారు.
ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇతర దేశాల పౌరులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన పౌరులు మరణించారని ఆ దేశ అధ్యక్ష భవనం వైట్ హౌస్ పేర్కొంది. తాజాగా భారత్ కు చెందిన ఓ మహిళ గాయపడ్డారు.
ఇజ్రాయెల్ లో పనిచేస్తున్న కేరళకు చెందిన నర్సు హమాస్ ల చేతిలో గాయాలపాలయ్యారు. ఆమె తన భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది.
ఏడేళ్లుగా కేరళకు చెందిన 41 ఏళ్ల షీజా ఆనంద్ ఇజ్రాయెల్ లో ఉంటూ నర్సుగా సేవలందిస్తున్నారు. అయితే శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ పై హమాస్ ఆకస్మికంగా దాడి చేసింది. ఈ సమయంలో ఆమె తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. తాను క్షేమంగా ఉన్నానని సమాచారం ఇచ్చింది. అయితే కొంత సమయం తరువాత భారత్ లో ఉన్న తన భర్తకు వీడియో కాల్ చేసింది.
భర్తతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉండగానే పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ జరిపిన దాడిలో గాయపడింది. ఆ తర్వాత మరోసారి భర్తకు ఫోన్ చేసింది. అయితే వెనకాల నుంచి భయంకరమైన పెద్ద శబ్దం వినిపించి హఠాత్తుగా కాల్ ఆగిపోయింది. చాలా సమయం తరువాత మళ్లీ ఆమె తన కుటుంబ సభ్యులకు కాల్ చేసి, తాను గాయపడ్డానని శస్త్రచికిత్స చేయించుకున్నట్లు సమాచారం అందించింది. ఆపరేషన్ కోసం తనను వేరే హాస్పిటల్ కు తరలిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. షీజా ఆనంద్ భర్త, ఇద్దరు పిల్లలు భారత్ లో ఉన్నారు. ఆమె భర్త పుణెలో ఉద్యోగం చేస్తున్నారు.
మరోవైపు కేరళకు చెందిన 200 మందికి పైగా బెత్లెహేమ్లోని ఓ హోటల్లో చిక్కుకుపోయి సురక్షితంగా ఉన్నారు. తాము ప్రార్థనలకు హాజరవుతున్న సమయంలో వైమానిక దాడుల సైరన్లు వినిపించాయని బృందంలోని సభ్యుల్లో ఒకరైన జాయ్ చెప్పినట్లు మలయాళ దినపత్రిక ‘మాతృభూమి’ తెలిపింది. ఈ బృందాన్ని బెత్లెహేమ్ లోని తమ హోటల్ లో బస చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం వారు సోమవారం ఈజిప్టు వెళ్లాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. కొచ్చికి చెందిన మరో 45 మంది పాలస్తీనాలోని ఓ హోటల్లో చిక్కుకుపోయారు. ఈ బృందం సురక్షితంగా ఉందని, సరిహద్దు దాటేందుకు అనుమతి లభించిందని ‘మాతృభూమి’ పేర్కొంది. ఇజ్రాయెల్ లో భారత రాయబారి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఇజ్రాయెల్ లో పరిస్థితిని వివరించారు.