ప్రపంచమంతా కరోనా వైరస్ తో తీవ్రస్థాయిలో పోరాడుతోంది. ఈ పోరాటంలో మాస్కును రక్షణ కవచంలా వాడుతోంది. అందుకే అనేక దేశాల్లో మాస్కులు పెట్టుకోకపోతే ఫైన్లు వేస్తూ, కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి.  

అయితే ఆ దేశంలో మాత్రం మాస్కులు వేసుకోకుండా స్వేచ్ఛగా తిరగొచ్చు. అదేంటీ అంటారా? అవును కరోనాగాఢాంధకారంలాంటి పరిస్థితుల్లోనూ ఇజ్రాయెల్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగేందుకు ఇజ్రాయిల్ ప్రభుత్వం అనుమతినిచ్చింది.

అక్కడ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? ప్రజల ఆరోగ్యం గురించి పట్టదా? లాంటి సందేహాలు వస్తున్నాయి కదా.. అయితే అక్కడ తీసుకున్న చర్యల గురించి తెలిస్తే.. మీరు షాక్ అవుతారు. ఆ దేశ ప్రభుత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు..

బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరగడానికి అనుమతినివ్వడంతో పాటు,  స్కూళ్లు, కాలేజీలు కూడా తెరిచారు. అయితే కార్యాలయాల్లో పనిచేసే టైంలో మాత్రం మాస్కు పెట్టుకోవడం తప్పనిసరి అనే నిబంధనను కొనసాగిస్తున్నారు. 
ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం దేశంలోని అత్యధిక జనాభాకు టీకాలు వేయడమే. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇజ్రాయెల్లోని 93 లక్షల మంది జనాభాలోని 53 శాతం ప్రజలకు ఇప్పటికే రెండు డోసుల టీకాలు వేశారు.

ఫలితంగాఇజ్రాయెల్లో కరోనా వ్యాధి రేటు కూడా గణనీయంగా తగ్గింది. దీంతో ఏడాది గా కొనసాగిస్తున్న అనేక కరోనా ఆంక్షలకు ప్రభుత్వం సడలింపును ఇచ్చింది. బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, తదితర ప్రాంతాల్లో మినహాయింపు నిచ్చారు.

అయితే ఇన్ డోర్ ప్రాంతాల్లో మాత్రం మాస్కు పెట్టుకోవాలనే నిబంధనను కొనసాగిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు పబ్లిక్ రేడియోలో మాట్లాడుతూ,, దేశానికి విదేశీ పర్యాటకులు, వ్యాపారుల రాకకు ఆహ్వానిస్తున్నామని... అయితే కరోనా టికా రెండు డోసులు తీసుకున్న వారికే అనుమతి ఇస్తామని అన్నారు. ఫలితంగా దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అన్నారు.