గాజాను రెండుగా విభజించి.. : దాడులను మరింత ఉధృతం చేసిన ఇజ్రాయెల్ సైన్యం..
ఇజ్రాయెల్-హమాస్ యుద్దం కొనసాగుతుంది. హమాస్ గ్రూప్ నెట్‌వర్క్‌ను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ముందుకు సాగుతుంది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్దం కొనసాగుతుంది. హమాస్ గ్రూప్ నెట్‌వర్క్‌ను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే గాజాను రెండుగా విభజించి ఇజ్రాయెల్ బలగాలు దాడులకు దిగుతున్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ.. గాజాపై గణనీయమైన దాడులు నిర్వహించబడ్డాయని చెప్పారు. గాజా స్ట్రిప్ రెండుగా(ఉత్తర,దక్షిణ భాగాలుగా) విభజించామని.. యుద్దంలో ఇది కీలకమైన దశ అని తెలిపారు. ఇప్పుడు తీవ్రవాద మౌలిక సదుపాయాలపై విస్తృత దాడులు చేపడుతున్నామని చెప్పారు. భూతలంతో పాటు గగనతలం నుంచి కూడా దాడులు జరుగుతున్నాయని తెలిపారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్దం కారణంగా.. గాజాలో మరణాల సంఖ్య పెరుగుతుంది. ఈ పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం అవుతుంది. అయితే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం.. బందీలను తిరిగి ఇచ్చే వరకు కాల్పుల విరమణ ఉండదు అని పునరుద్ఘాటించారు. తాము విజయం సాధించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. తమకు ప్రత్యామ్నాయం లేదని అన్నారు.
ఇక, హమాస్-నడపబడుతున్న భూభాగంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. నాలుగు వారాలకు పైగా జరుగుతున్న యుద్ధంలో కనీసం 9,770 మంది మరణించారు. అందులో ఎక్కువగా పౌరులే ఉన్నారు.
ఇజ్రాయెల్-హమాస్ పోరు నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా పశ్చిమాసియాలో దౌత్య యత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రంలోనే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్.. వెస్ట్ బ్యాంక్, ఇరాక్, సైప్రస్‌లలో సుడిగాలి పర్యటన చేపట్టారు. వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తో బ్లింకెన్ భేటీ అయ్యారు. బ్లింకెన్, అబ్బాస్‌లు వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై తీవ్రవాద హింసను ఆపాల్సిన అవసరం గురించి చర్చించినట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి. ఇక, బాగ్దాద్‌లో ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుదానీతో బ్లింకెన్ సమావేశమయ్యారు.