ఇజ్రాయెల్‌పై గాజా వైపు నుంచి రాకెట్ల వర్షం.. యుద్దానికి సిద్దమేనన్న ఇజ్రాయెల్ సైన్యం..
ఇజ్రాయెల్‌పై గాజా వైపు నుంచి రాకెట్స్ దూసుకురావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్‌లోని అనేక నివాస ప్రాంతాలపై గాజా వైపు నుంచి రాకెట్లు ప్రయోగించబడ్డాయి.
ఇజ్రాయెల్‌పై గాజా వైపు నుంచి రాకెట్స్ దూసుకురావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్‌లోని అనేక నివాస ప్రాంతాలపై గాజా వైపు నుంచి రాకెట్లు ప్రయోగించబడ్డాయి. హమాస్(పాలస్తీనా మిలిటెంట్లు) ఈ దాడులకు పాల్పడుతోంది. గాజా నుంచి రాకెట్ల దాడి తరువాత ఇజ్రాయెల్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయోల్ తెలిపింది. హమాస్‌ను తీవ్ర పరిణామాలను హెచ్చరించింది. శనివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 06:30 గంటల నుంచి గాజాలోని పలు ప్రాంతాల నుండి రాకెట్ కాల్పులు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది.
ఇజ్రాయోల్ భూభాగం వైపు డజన్ల కొద్ది రాకెట్లు దూసుకొచ్చాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ సైన్యం.. దేశం దక్షిణ, మధ్య ప్రాంతాలలో ఒక గంటకు పైగా సైరన్లతో జనాలకు హెచ్చరికలు జారీచేసింది. బాంబు షెల్టర్ల దగ్గర ఉండమని ప్రజలను కోరింది. అనేక మంది ఉగ్రవాదులు గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఇక, ఇజ్రాయెల్‌పై హమాస్ 5000కు పైగా రాకెట్లను ప్రయోగించిందనే ఆరోపణలు వస్తున్నాయి. చొరబాటుకు సంబంధించి ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. గాజా వైపు నుంచి ఉగ్రవాదులు చొరబడ్డారని సైన్యం తెలిపింది. ఈ ప్రాంత ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నామని సైన్యం పేర్కొంది. అయితే ఈ రాకెట్ల దాడుల వల్ల ఏ మేరకు నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఈ రాకెట్ల దాడుల్లో ఒక మహిళ మృతిచెందిందని వార్తలు వెలువడుతున్నాయి.
ఇదిలాఉంటే, అయితే.. గాజా స్ట్రిప్‌లో 2007 నుంచి హమాస్ మిలిటెంట్ గ్రూప్ అధికారం చేపట్టింది. దీంతో గాజాపై ఇజ్రాయెల్ దిగ్బంధనాన్ని విధించింది. అప్పటి నుండి పాలస్తీనా మిలిటెంట్లు, ఇజ్రాయెల్ అనేక విధ్వంసకర యుద్ధాలు చేశారు.