ఖగోళంలో ప్రతి కొత్త అంశం అబ్బురమే అనిపిస్తుంది. ఎన్నో వింతలు, విచిత్రాలు రోదసిలో దాగి ఉన్నాయి. తాజాగా, అంగారక గ్రహంపై ఓ క్రేటర్ చిత్రాన్ని నాసా విడుదల చేసింది. ఈ చిత్రం నెటిజన్లలో ఏలియన్ల చర్చను రాజేసింది. ఆ క్రేటర్ రూపురేఖలు గ్రహాంతరవాసి అడుగుగా ఉన్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 

న్యూఢిల్లీ: మన ఊహకు అందనివాటిని అతీత శక్తులుగా ఆపాదించడం అనాదిగా వస్తున్నదే. ధ్వంసమైన చరిత్రలోని శకలాలను ఇప్పటికీ ఊహించలేకున్నాం. ఉదాహరణకు ఈజిప్టులో పిరమిడ్ల నిర్మాణం. పిరమిడ్ల నిర్మాణం చుట్టూ అనేక ఊహాగానాలు ఉన్నాయి. వీటితోపాటు మరెన్నో కట్టడాలు, ఆకృతుల వివరాలు అంతుచిక్కకుండా ఉన్నాయి. వీటిలో చాలా వాటిని గ్రహాంతరవాసులతో ముడిపెట్టే కథనాలు బోలెడు. దేనిని కూడా ఒకే మాటలో కొట్టివేయడం సాధ్యపడకపోవచ్చు. కానీ, గ్రహాంతరవాసులపై చర్చ మాత్రం
నిరంతరం ఏదో రూపంలో కొనసాగుతూనే ఉన్నది. తాజాగా, మరోసారి ఈ చర్చ నాసా విడుదల చేసిన అంగారకుడిపై ఓ తలం చిత్రంతో మళ్లీ మొదలైంది. నిజంగా, గ్రహాంతరవాసులు ఉన్నారా? లేరా? అనేది ఇప్పటికీ నిర్దారణ కాలేదు. కానీ, కొందరు మాత్రం ఈ ఏలియన్స్ తప్పకుండా ఉండే ఉంటాయని బలంగా విశ్వసిస్తుంటారు. నాసా చిత్రాన్ని చూస్తూ అది ఎలియెన్ అడుగు అని పేర్కొంటున్నారు.

అమెరికా నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) సోమవారం అంగారక గ్రహంపై ఉన్న ఓ భారీ అగాధాన్ని(గుంత?) మై రిజల్యూషన్ ఫొటోను విడుదల చేసింది. ది మార్షియన్ క్రేటర్ మార్క్స్ ద స్పాట్ అంటూ ఈ చత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసింది. ఈ చిత్రం నిజంగానే అద్భుతంగా, అనూహ్యంగా ఉన్నది. ఆ క్రేటర్‌లోపల ఉన్న చారికల వంటి ఆకారం ఆశ్చర్యకరంగా ఊహకు అతీతంగా ఉన్నాయి. ఇవే నెటిజన్లకు ఏలియన్లను గుర్తు చేశాయి.

View post on Instagram

నాసా పోస్టు చేసిన చిత్రంలో ఇలా క్యాప్షన్ రాసింది. ‘మీరు చూస్తున్న చిత్రం మార్స్‌కు చెందని జీరో డిగ్రీల లాంగిట్యూడ్. అంటే మన భూగోళంపైని గ్రీన్‌విచ్ అబ్జర్వేటరీకి సరిపోలినది. గ్రీన్‌విచ్ అబ్జర్వేటరీ భూమి ప్రైమ్ మెరీడియన్‌(భూగోళంపై ఊహాత్మకంగా ఉండే దక్షిణ, ఉత్తర రేఖలు, ఇవే భూమిపై పశ్చిమ, తూర్పు రేఖల కలయికను గుర్తిస్తాయి)ను సూచిస్తుంది’ అని పేర్కొంది. అలాగే, ఈ చిత్రం రిజల్యూషన్ గురించి ప్రస్తావించింది.

ఈ పోస్టు షేర్ చేయగానే సుమారు ఐదు లక్షల మంది వరకు లైక్ చేశారు. చాలా మంది తమ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్‌లో పేర్కొన్నారు. అందులోనే ఏలియన్ల ప్రస్తావన వచ్చింది. ఈ చిత్రం చూస్తే.. అది మార్స్ గ్రహంపై గ్రహాంతరవాసి అడుగుజాడగా కనిపిస్తున్నదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరు దేవుడి సృష్టి రమణీయంగా ఉంటుందని, ఈ విశ్వం కూడా అందుకు మినహాయింపేమీ కాదని పేర్కొన్నాడు. ఇంకొకరు ఈ చిత్రం చూస్తే నోటి వెంట మాట రావట్లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.