Asianet News TeluguAsianet News Telugu

అదీ నారీ శక్తి అంటే..! మహ్సా అమిని అంత్యక్రియల్లో హిజాబ్ తొలగించి ఇరాన్ మహిళల నిరసన.. ‘నియంత చావాలి’

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా దాన్ని తొలగించిన 22 ఏళ్ల మహ్సా అమినిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె పోలీసు అదుపులోనే సెప్టెంబర్ 17న మరణించారు. దీంతో ఆమె అంత్యక్రియల్లో ఇరాన్ నారీ శక్తి కదిలింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియంత చావాలి అని నినదించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారాయి.
 

iran women protests by taking off hijab at mahsa amini last rites who died in police detention after removing veil in public
Author
First Published Sep 18, 2022, 6:57 PM IST

న్యూఢిల్లీ: ఇరాన్ అంటే మోరల్ పోలీసింగ్ ఎక్కువ ఉంటుందని అందరూ ఊహిస్తారు. అక్కడ మహిళలు హిజాబ్ లేకుండా బయట అడుగు పెట్టడం నేరం. అలాంటి చోట ఈ మోరల్ పోలీసింగ్‌ను బద్ధలు కొట్టడానికి ఓ ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమం అనతికాలంలోనే ఏకంగా రాజ్యానికే వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసి పడ్డది. నియంత చావాలి అనే నినాదాలు వారి నిరసనల్లో వినపడటం గమనార్హం.

కొన్ని నెలలుగా ఇరాన్ హక్కుల కార్యకర్తలు బహిరంగంగా హిజాబ్ తొలగించాలని మహిళలకు పిలుపు ఇస్తున్నారు. కానీ, ఇలా చేయడం అంటే తమను తాము పోలీసులకు అప్పగించుకున్నట్టే. ఈ దేశ డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించడమే.. అంటే కటకటాల పాలుకావడమే. ప్రభుత్వ అనైకతి వ్యవహారానికి వ్యతిరేకంగా మహిళలు స్వేచ్ఛను పొందాలని, హిజాబ్ తొలగించుకోవాలని కార్యకర్తలు పిలుపు ఇస్తున్నారు. ఈ పిలుపుతోనే ఓ మహిళ హిజాబ్ తొలగించింది. ఆమె పేరు మహ్సా అమిని. పోలీసులు వెంటనే ఆమెను అరెస్టు చేశారు. ఆమె పోలీసుల కస్టడీలోనే శనివారం (సెప్టెంబర్ 17) మరణించింది. పోలీసుల దాడి వల్లే ఆమె చనిపోయిందనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మహ్సా అమిని మరణం ఇప్పుడు ఇరాన్ మహిళల ఉద్యమానికి తక్షణ కారణంగా మారింది. మహ్సా అమిని అంత్యక్రియల్లో  మహిళలు విశ్వరూపం చూపారు. హిజాబ్ తొలగించి మహ్సా అమినికి వీడ్కోలు పలికారు.

ఆమె మరణానికి కారణంగా భావిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదలు చేశారు. ఏకంగా నియంత చావాలి అనే నినాదాలు చేయడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్టు ట్వీట్ చేశారు. 22 ఏళ్ల మహ్సా అమిని హత్యను నిరసిస్తూ ఇరాన్-సంఘేజ్ మహిళలు హిజాబ్ తొలగించారు. నియంత చావాలి అనే నినాదాలు చేశారని జర్నలిస్టు మాసిహ్ అలినెజాద్ పేర్కొన్నారు.

ఈ నిరసనల్లో కొందరు ఆందోళనకారులు ఖాసీం సులేమానీ బ్యానర్‌ను కూడా తొలగించారు. (ఐఆర్‌జీసీ ఖుద్స్ ఫోర్స్ దివంగత కమాండర్. ఈయనకు ఇరాన్‌లో విశేష ఆదరణ ఉన్నది. అమెరికా డ్రోన్ దాడిలో మరణించిన ఖాసీం సులేమానీతో అప్పట్లో ఇరాన్ మొత్తం రగిలిపోయింది. ఆయన అంత్యక్రియలకు లక్షలాది మంది హాజరైన చిత్రం వైరల్ అయింది.)

ఆందోళనలు వెల్లువెత్తిన తరుణంలో దేశ అధ్యక్షుడు ఎబ్రహిమ్ రైసీ మహ్సా అమిని మరణంపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసినట్టు ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది.

ఇరాన్ ప్రభుత్వంపై నోరు మెదపాలంటే భయపడతారు. అక్కడి శిక్షలు అలా ఉంటాయి. మరణ శిక్షలు ఈ మధ్య ఎక్కువ అమలు చేస్తున్న దేశంగానూ ఇరాన్‌కు పేరుంది. అలాంటి దేశంలో నారీ శక్తి గళం విప్పడం స్వయంగా వారి సాహసాన్ని వెల్లడించుకున్నట్టయింది.

Follow Us:
Download App:
  • android
  • ios