కొందరు ఇన్వెస్టర్లు క్రౌండ్ ఫండింగ్ ద్వారా బెలీజ్ దేశానికి చెందిన కాఫీ కేయ్ అనే దీవిని కొనుగోలు చేశారు. ఈ దీవిని ప్రత్యేక దేశంగా వారు నిర్మించాలనుకుంటున్నారు. సొంత జెండా, సొంత గీతం, సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దీనికి 96 మంది యజమానులు ఉండగా, 249 మంది ఈ దీవి పౌరులుగా భావిస్తున్నారు.
న్యూఢిల్లీ: మీరెప్పుడైనా ఒక ఐలాండ్(Island)కు ఓనర్‌గా ఉండాలని కలగన్నారా? అసలు ఆ ఆలోచన రాదు. ఒక వేళ ఎవరు ప్రస్తావించినా.. నవ్వి కొట్టిపారేస్తారు. కానీ, కొందరు ఇన్వస్టర్లు(Investors) ఎవరూ ఆలోచించని రీతిలో ప్లాన్ వేసుకున్నారు. ఒక ద్వీపాన్ని కొనుగోలు చేయాలనుకున్నారు. దానిలో యాజమాన్య హక్కుల్లో భాగస్వామ్యాలకూ అవకాశం ఇవ్వాలని యోచించారు. అంతేకాదు, వారి యాజమాన్యంలోని ఆ ద్వీపంలో పౌరులుగానూ ఇతరులు ఉండటానికి ఏర్పాట్లు చేయాలని అనుకున్నారు. అంతే.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా సొమ్ము కూడబెట్టి.. ఓ దేశం నుంచి ఒక ఐలాండ్‌ను కొనుగోలు చేశారు. ఈ విచిత్ర విషయాలను ఓ సారి పరిశీలిద్దాం.
కొందరు ఇన్వెస్టర్లు ఓ ద్వీపాన్ని కొనుగోలు చేయాలని ఆలోచించారు. 15 ఏళ్ల క్రితం ఒక ఐలాండ్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచన లెట్స్‌బైయాన్ఐలాండ్ అనే వెబ్‌సైట్ సీఈవో గ్యారెట్ జాన్సన్‌కు వచ్చింది. ఒక చిన్న దీవిని కొనుగోలు చేసి దాన్ని ఒక బుల్లి దేశంగా నిర్మించాలనే ఆలోచన వారిలో ఒక కొత్త హుషారును తెచ్చింది. తొలుత ఆ ఆలోచన చాలా పిచ్చిదిగా అనిపించింది. ఇతరులు చాలా మంది అలాగే భావించారు. కానీ, ఆయనతోపాటు మరికొందరు కలిసి ఐలాండ్‌ను కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు కొనసాగించారు. మధ్య అమెరికాలో కరీబియన్ సముద్రంలో బెలీజ్ దేశం ఉన్నది. ఈ దేశానికి చెందినదే కాఫీ కేయ్(Coffee Caye) ద్వీపం ఉన్నది. కానీ, 2018లో ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఓ దీవిని అమ్మకానికి ఉన్నదనే వార్త వారిలో ఈ ఆలోచన బలపడటానికి కారణం అయింది.
వారు క్రౌడ్ ఫండింగ్ కోసం అనేక ప్రయత్నాలు చేశారు. మొత్తం 96 మంది ఇన్వెస్టర్లుగా మారి ఈ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. బెలీజ్‌లోని కాఫీ కేయ్ దీవిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. 2018లో ఈ ప్రాజెక్టు ప్రారంభం అయింది. 2019 కల్లా ఆ ఇన్వెస్టర్ల గ్రూపు సుమారు 2.5 లక్షల అమెరికన్ డాలర్లను పోగు చేసింది. మధ్య అమెరికా దేశమైన బెలీజ్‌కు చెందిన కాఫీ కేయ్ దీవి కరీబియన్ సముద్రంలో ఉన్నది. ఇది 1.2 ఎకరాల ఐలాండ్. దీన్ని పై మొత్తంతో ఆ ఇన్వెస్టర్ల గ్రూపు కొనుగోలు చేసింది.
2022 ఫిబ్రవరిలో తొలిసారిగా ఈ టూర్ గ్రూప్ కాఫీ కేయ్ దీవిలో ల్యాండ్ అయింది. ఇందులో 13 మంది టూరిస్టులు, ఓనర్లు ఉన్నారు. వారు ఈ చిన్ని దేశాన్ని లాంచ్ చేశారు. ప్రస్తుతం 249 మంది ఈ దీవికి చెందిన పౌరులుగా ఉన్నారు. సమీప భవిష్యత్‌లో ఈ దీవిలో పౌరుల సంఖ్యను 5000లకు పెంచాలని ఆలోచిస్తున్నారు.
ఆ ఇన్వెస్టర్లు కేవలం రియల్ ఎస్టేట్‌లో భాగంగా బెలీజ్ దీవిని మాత్రమే కొనుగోలు చేయలేదని, ఆ దీవిని నిజంగా ఒక దేశంగా నిర్మిస్తున్నారని ఓ మీడియా సంస్థ పేర్కొంది. అంటే, ఆ దీవి ప్రత్యేకంగా ఒక జెండా, ఒక గీతం, ఒక ప్రభుత్వం కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలో ఒక కొత్త మైక్రో నేషన్‌గా ఉంటుందని తెలిపింది. అయితే, ఈ దేశ స్వాతంత్ర్యాన్ని ఇప్పటికైతే అంతర్జాతీయ సమాజం గుర్తించలేదు.
