Asianet News TeluguAsianet News Telugu

సూడాన్‌లో ఆర్మీ-పారా మిలటరీ బలగాల మధ్య యుద్ధం .. భారతీయుడి మృతి, ధ్రువీకరించిన ఇండియన్ ఎంబసీ

ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య జరుగుతున్న ఘర్షణలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అక్కడి భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. 

Indian Working In Sudan Dies Of Stray Bullet Injury over clashes between army and paramilitary forces ksp
Author
First Published Apr 16, 2023, 3:16 PM IST

ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య జరుగుతున్న ఘర్షణ  రక్తపుటేరులు పారిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి స్థానికులు, విదేశీయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని భారత రాయబార కార్యాలయం సైతం .. ఇక్కడ స్థిరపడిన భారతీయులు అప్రమత్తంగా వుండాలని, ఇళ్లు దాటి బయటకు రావొద్దని హెచ్చరించింది. అయితే హింసాత్మక ఘటనల మధ్య ఇక్కడ పనిచేస్తున్న భారతీయుడొకడు బుల్లెట్ గాయంతో మరణించాడు. మృతుడిని ఇక్కడి దాల్ గ్రూప్ కంపెనీలో పనిచేస్తున్న ఆల్బర్ట్ అగెస్టీన్‌గా గుర్తించారు. ఇతని శరీరంపై పలు చోట్ల బుల్లెట్ గాయాలు వున్నట్లు మీడియా నివేదించింది. అక్కడి భారత రాయబార కార్యాలయం సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మృతుడి కుటుంబానికి మద్ధతుగా వున్నట్లు వెల్లడించింది. 

మరోవైపు.. సూడాన్ నుంచి సౌదీ అరేబియాలోని రియాద్‌కు ప్రయాణించాల్సిన విమానంపై శనివారంపై ఫైరింగ్ జరిగింది. ఎయిర్ బస్ ఏ330 విమానం పై కాల్పులు జరిగాయని, అందులో ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని ఎయిర్‌లైన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. రియాద్‌కు వెళ్లడానికి సిద్ధమవుతుండగా.. ప్రయాణికులంతా బోర్డింగ్ అయ్యాక ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని, ప్రయాణికులు, సిబ్బంది అంతా సేఫ్ అని ఆ స్టేట్‌మెంట్ పేర్కొంది. వారంతా సురక్షితంగా సూడాన్‌లోని సౌదీ ఎంబసీకి చేరుకున్నట్టు వివరించింది. ఇదిలా ఉండగా, సూడాన్‌లో పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి ఇతర దేశాల విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. 

కాగా.. పారామిలటరీలోని రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దళాన్ని సూడాన్ సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనే ఈ అల్లర్లకు కారణం. ఈ విషయానికి సంబంధించి సైనికాధిపతి అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్, పారామిలటీ కమాండర్ మహ్మద్ హందాన్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. దేశ రాజధాని ఖార్టూమ్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరు వర్గాలు కాల్పులు చేసుకోవడంతో పాటు బాంబు దాడులకు దిగుతున్నాయి. సూడాన్ అధ్యక్ష భవనం, బుర్హాన్ నివాసం, రాజధానిలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పారా మిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. వచ్చే కొద్దిగంటల్లో ఇరు వర్గాల మధ్య దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశం వుండటంతో పౌరులు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ అప్రమత్తమై అడ్వైజరీ జారీ చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios