అమెరికా, బ్రిటన్‌లు పొమ్మన్నాయా? అయితే కెనడా రండి..!

Indian Students Prefers Canada For Study Over US and UK
Highlights

విద్యార్థుల వీసాల విషయంలో అమెరికా, బ్రిటన్ దేశాలు కఠినమైన వైఖరి అనుసరిస్తున్న తరుణంలో కెనడా మాత్రం తమ దేశానికి విద్యార్థులు స్వేచ్ఛగా రావచ్చని ఆహ్వానిస్తోంది. 

విద్యార్థుల వీసాల విషయంలో అమెరికా, బ్రిటన్ దేశాలు కఠినమైన వైఖరి అనుసరిస్తున్న తరుణంలో కెనడా మాత్రం తమ దేశానికి విద్యార్థులు స్వేచ్ఛగా రావచ్చని ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో మాస్టర్ డిగ్రీల కోసం అమెరికా, బ్రిటన్ వెళ్లాలనుకునే విద్యార్థులు ఇప్పుడు కెనడా వైపు అడుగులేస్తున్నారు. ఈ మేరకు కెనడా ప్రభుత్వం విద్యార్థుల వీసా నిబంధనలను మరింత సులభతరం చేసింది.

ఒకప్పుడు కెనడా వీసా క్లియరెన్స్‌కు 60 రోజుల సమయం పట్టేది, అయితే ఇప్పుడు కేవలం  45 రోజుల్లోనే వీసాలను జారీ చేయనున్నారు. ఇందు కోసం కెనడా 'స్టూడెంట్‌ డైరెక్ట్‌ స్ట్రీమ్‌' (ఎస్‌డీఎస్‌) పేరుతో ఓ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఆర్థిక స్థోమత ఉండి, ఆంగ్ల భాషపై పట్టున్న వారికి త్వరగా వీసా వచ్చేస్తుంది.

గతంలో ఉన్న స్టూడెంట్‌ పార్ట్‌నర్స్‌ ప్రోగ్రామ్‌ (ఎస్‌పీపీ) ప్రకారం కేవలం ఎంపిక చేసిన 40 కాలేజీల్లోని కొన్ని కోర్సులు మాత్రమే అది కూడా చాల క్లిష్టమైన వీసా విధానంతో విదేశీ విద్యార్థులకు అందుబాటులో ఉండేవి. కాగా.. ఇప్పుడు ఎస్‌డీఎస్‌ ప్రకారం కాలేజీ విద్య (పోస్ట్‌ సెకండరీ కోర్సులు) అంతటినీ అన్ని కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చారు.

ఓవైపు ప్రతిభ ఎక్కువ ఉన్నవారికే అమెరికాలోకి ప్రవేశించడానికి అర్హత కల్పిస్తామని ట్రంప్ సర్కార్ ప్రకటిస్తే, మరోవైపు బ్రిటన్ సర్కారు మాత్రం విదేశీ స్టూడెంట్ వీసాల విషయంలో సడలింపులు చేసి అందులో భారత్‌ను చేర్చకుండా చిన్నచూపు కనబరిచింది. ఈ నేపథ్యంలో, విద్యార్థులు కూడా సులువుగా ప్రవేశించగలిగే కెనడా దేశం వైపే మొగ్గు చూపుతున్నారు.

తాజా గణాంకాల ప్రకారం, గత 2017లో మొత్తం 83,410 మంది విద్యార్థులకు స్టడీ వీసాలు జారీ చేశారు, 2016తో పోల్చుకుంటే ఇది దాదాపు 58 శాతం అధికం. అలాగే, ఈ ఏడాది జనవరి-ఏప్రిల్‌ మధ్య కాలంలో కూడా 29,500 భారతీయ విద్యార్థులు కెనడా కాలేజీల్లో చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి.

loader