భారత సంతతికి చెందిన కమల హారిస్ అమెరికా ఉపాధ్యక్ష రేసులో నిలిచారు. డెమొక్రాట్ల తరుఫున ఉపాధ్యక్ష పదవికి ఈ కాలిఫోర్నియా సెనెటర్ ని ఎంపిక చేస్తున్నట్టు డెమొక్రాట్ల తరుఫున అధ్యక్షుడిగా ట్రంప్ తో తలపడుతున్న జో బిడెన్ ప్రకటించారు. 

రిపబ్లికన్ల తరుఫున బరిలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ని ఢీకొనడానికి ఉపాధ్యక్ష పదవి కోసం ఎవరి పేరు ముందుకు తీసుకురావాలి అని గత కొన్ని నెలలుగా మల్లగుల్లాలు పడుతున్న బిడెన్... ఎట్టకేలకు కమల హారిస్ పేరును అనూహ్యంగా ప్రకటించాడు.

ట్విట్టర్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేసారు. కమల ను ఎంపిక చేయడం బిడెన్ కు ఈ సమయంలో అత్యంత కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు. ఆమె భారతీయ సంతతికి చెందినది అవడం ఇక్కడ బిడెన్ కి కలిసొస్తుంది. 

తనను ఎంపిక చేసినందుకు సంతోషం ప్రకటిస్తూ ట్విట్టర్ వేదికగా.... "జో బిడెన్ అమెరికాను ఏకీకృతం చేయగలడని, ఆయన తన జీవితాన్నంతటినీ అమెరికా కోసం పోరాడుతూనే గడిపాడని, మన ఆదర్శాలకు అనుగుణంగా అమెరికాను నిర్మించగలడని" ఆమె అన్నారు. 

డెమొక్రాట్లు గనుక గెలవగలిగితే... ఇది ఆమె రాజకీయ కెరీర్ కి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. 2024 లేదా 2028 అధ్యక్ష ఎన్నికల రేసులో ఆటోమేటిక్ గా ఆమె అధ్యక్ష పదవికి పోటీ పడేవారిలో ముందువరుసలో ఉంటుంది. అన్నీ కలిసొస్తే ఒక భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికా అధ్యక్షపీఠాన్ని అధిరోహించడం కూడా మనం చూడవచ్చు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఈమె అభ్యర్థిత్వానికి మద్దతు పలికాడు. 

కమల హారిస్ తల్లి భారతీయురాలు కాగా, తండ్రి జమైకా దేశస్థుడు. ఆమె ప్రస్తుతం కాలిఫోర్నియా సెనెటర్ గా కొనసాగుతున్నారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా నియమితులైన తొలి నల్ల జాతీయురాలైన మహిళ కాగా... సెనెట్ కి ఎన్నికైన రెండవ నల్లజాతీయురాలు కూడా. దక్షిణాసియా సంతతికి చెందిన మొట్టమొదటి సెనెటర్ కూడా ఈమెనే!

తొలుత ప్రిలిమినరీల్లో అధ్యక్షపదవికి డెమొక్రాట్ల తరుఫున పోటీ పడ్డారు. బిడెన్ తో డిబేట్లలో కూడా పాల్గొన్న కమల.... ఆ తరువాత అధ్యక్ష  రేసు నుంచి తప్పుకొని బిడెన్ కు మద్దతు ప్రకటించింది. డిబేట్లో బిడెన్ ని బాగానే కార్నర్ చేసినప్పటికీ... అతడు మాత్రం అదేమి మనసులో పెట్టుకోకుండా ఆమెను ఒక అద్భుతమైన ప్రజాసేవకురాలిగా కొనియాడుతూ... తనతోపాటు అమెరికా బరిలో నిలిపాడు.