కరోనా సోకుతుందన్న భయంతో విమానం ఎక్కడానికి భయపడిన ఓ 36యేళ్ల భారతీయ సంతతి వ్యక్తి మూడు నెలలుగా విమానాశ్రయంలోనే ఉన్నాడు. సెక్యూరిటీ కెమెరాలకు చిక్కుండా ఎయిర్ పోర్ట్ లోని సెక్యూర్డ్ ఏరియాలో అనధికారికంగా ఉన్న వ్యక్తిని చికాగో అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు అరెస్ట్ చేశారు. 

కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ శివార్లలో నివసించే ఆదిత్య సింగ్ అక్టోబర్ 19 నుండి చికాగోలోని ఓ'హేర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంటున్నాడు. అతన్ని గుర్తించిన విమానాశ్రయ అధికారులు శనివారం అరెస్టు చేసినట్టు చికాగో ట్రిబ్యూన్ ఆదివారం వెల్లడించింది.

విమానాశ్రయ నిషేధిత ప్రాంతంలో చొరబడటం అనే నేరానికి పాల్పడటం, విమానాశ్రయంలో దొంగతనం చేసినట్లుగా సింగ్ మీద అభియోగాలు మోపబడ్డాయి.

అక్టోబర్ 19 న లాస్ ఏంజిల్స్ నుండి ఓ విమానంలో సింగ్ ఓ'హేర్ కు వచ్చాడు. ఆ తరువాత అక్కడినుంచి వెళ్లలేదు. అప్పటినుండి విమానాశ్రయ భద్రతా జోన్లోనే కాపురం పెట్టాడని ఆరోపించారు.

అతని గుర్తింపు కార్డును చూపించమని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది అడిగినప్పుడు అసలు విషయం బయటపడింది. దీంతో అతన్ని అరెస్టు చేశారు. గుర్తింపు అడిగిన సిబ్బందికి అతను తన దగ్గరున్న బ్యాడ్జ్ చూపించాడు. అయితే ఆ బ్యాడ్జ్ ఆపరేషన్స్ మేనేజర్‌ది. అది పోయినట్టుగా అక్టోబర్ లోనే సదరు మేనేజర్ ఫిర్యాదు చేశాడు. 

ఆదిత్య సింగ్ విమానాశ్రయంలో స్టాఫ్ బ్యాడ్జ్ దొంగతనం చేసి ఇన్ని రోజులుగా ఎవ్వరినీ దొరకకుండా ఉన్నాడని, కోవిడ్ భయంతో ఇంటికి వెళ్లడానికి భయపడ్డాడని అసిస్టెంట్ స్టేట్ అటార్నీ కాథ్లీన్ హాగెర్టీ కోర్టుకు చెప్పారు. అంతేకాదు ఆదిత్య సింగ్ ఇతర ప్రయాణీకుల హ్యాండ్‌అవుట్‌లతో ఇన్ని రోజులు సర్వైవ్ అయ్యాడని కుగర్ కౌంటీ జడ్జి సుసానా ఓర్టిజ్‌తో హగెర్టీ చెప్పారు.

ఈ కేసు వివరాలు విన్న జడ్జి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘మీరు చెబుతుంది సరిగానే వింటున్నానా..  2020 అక్టోబర్ 19 నుండి 2021 జనవరి 16 వరకు ఓ'హేర్ విమానాశ్రయ టెర్మినల్ సెక్యూర్ ప్లేస్ లో అనధికారికంగా ఓ బయటి వ్యక్తి నివసిస్తున్నట్లు మీరు చెప్తున్నారు. ఇది ఇన్ని రోజులు కనిపెట్టలేకపోయారు? అంతేకదా మీరు చెప్పేది "అని ఓర్టిజ్ అడిగారు.

అయితే ఆదిత్య సింగ్ లాస్ ఏంజిల్స్ శివార్లలోని ఆరెంజ్‌లో రూమ్‌మేట్స్‌తో నివసిస్తున్నాడని, అతనికి క్రైమ్ బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేదని సింగ్ తరపు న్యాయవాది అసిస్టెంట్ పబ్లిక్ డిఫెండర్ కోర్ట్నీ స్మాల్‌వుడ్ తెలిపారు. అంతేకాదు సింగ్‌కు హాస్పిటాలిటీలో మాస్టర్స్ డిగ్రీ ఉందని, అతడు నిరుద్యోగి అని ఆమె కోర్టుకు తెలిపారు.

సింగ్ విషయంలో పరిస్థితులు అసాధారణమైనవే అయినా హింసాత్మకంగా లేవని స్మాల్ వుడ్ అన్నారు. అంతేకాదు సింగ్ చికాగో ఎందుకు వచ్చారనే విషయం అస్పష్టంగా ఉందని నివేదిక పేర్కొంది. అతన్ని తిరిగి జనవరి 27 న కోర్టులో హాజరుపరచనున్నారు. అతన్నివిమానాశ్రయంలోకి అనుమతించడానికి వెయ్యి డాలర్లు కట్టాల్సి ఉంటుందని తెలిపారు. 

అయితే ఈ కేసులో న్యాయమూర్తి మాట్లాడుతూ ‘ఇది చాలా విచిత్రంగా ఉంది. కేసులో పేర్కొన సమయానికి, కేసు పరిస్థితికి చాలా దిగ్భ్రాంతి కలుగుతుంది’ అన్నారు. అంతేకాదు విమానాశ్రయ సెక్యూరిటీ భాగంలో నకిలీ ఐడీతో ఓ మనిషి మూడునెలల పాటు ఉండడం, దాన్ని గుర్తించకపోవడం మామూలు విషయం కాదు. అని అన్నారు. 

సురక్షిత ప్రాంతాలుగా ఉండాల్సిన విమానాశ్రయాల్లో ఇలాంటి ఘటనలు అసాంఘిక చర్యలకు దారితీసే ప్రమాదం ఉందని కూడా ఓర్టిజ్ అభిప్రాయపడ్డారు. అయితే నగరంలోని విమానాశ్రయాలను పర్యవేక్షించే చికాగో డిపార్ట్మెంట్ ఆఫ్ ఏవియేషన్ ఓ ప్రకటన విడుదల చేస్తే మూడు నెలల పాటు అతను విమానాశ్రయంలో ఉన్నా ప్రజలకు గానీ, విమానాశ్రయ భద్రతకు గానీ ఎలాంటి హానీ తలపెట్టలేదని తెలిపారు.