భారత్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాలను తగ్గించుకుంటున్నట్టు పాకిస్తాన్ ప్రకటించడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. దాయాది దేశం తన నిర్ణయాన్ని పున: సమీక్షించుకోవాలని సూచించింది. ఆర్టికల్ 370 అనేది పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని.. తమతో సన్నిహిత సంబంధాలను తెంచుకోవాలనుకోవడం సరైన నిర్ణయం కాదని తెలిపింది.

తమపై దుష్ప్రచారం చేయడం ఇప్పటికైనా మానుకుని.. కశ్మీర్ విషయంలో తలదూర్చాలనే ప్రయత్నాలను పక్కనబెట్టాలని భారత విదేశాంగ శాఖ విమర్శించింది.

జమ్మూకాశ్మీర్‌ను అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగానే భారత్ తాజా చర్యను చేపట్టిందని.. దీని వల్ల అక్కడ లింగ, సామాజిక, ఆర్ధిక వివక్షను రూపు మాపడానికి సులభతరవవుతుందని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

తమ దేశపు చర్యలను పాక్ వ్యతిరేక దృష్టితో చూడటం కొత్తగా ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించలేదని చురకలు అంటించింది. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా బుధవారం ఇస్లామాబాద్‌లోని భారత రాయబారిని బహిష్కరించడంతో పాటు.. ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్న తమ రాయబారిని పాకిస్తాన్ నిలిపివేసిన సంగతి తెలిసిందే.