భూకంపం వల్ల తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం చవిచూసిన మొరాకోకు అన్ని విధాలా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇంత భారీ స్థాయిలో ప్రాణనష్టం జరగడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు.
మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో దేశానికి అన్ని విధాలా సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న జీ-20 సదస్సులో మోదీ తన ప్రారంభోపన్యాసంలో బాధితులకు సంతాపం తెలిపారు.
ఈ క్లిష్ట సమయంలో ప్రపంచ సమాజం మొత్తం మొరాకోకు అండగా ఉందని, వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు తమ దేశం కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. మొరాకోలో సంభవించిన భూకంపం కారణంగా ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరమని మోడీ అన్నారు. ఈ విషాద సమయంలో, నా ఆలోచనలు మొరాకో ప్రజలతో ఉన్నాయని చెప్పారు. ఈ భూకంపం వల్ల తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11:11 గంటలకు మొరాకోలోని మరకేష్ కు నైరుతి దిశగా 44 మైళ్ల (71 కిలోమీటర్లు) దూరంలో 18.5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 6.8 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం వల్ల దాదాపు 632 మందికి పైగా మరణించారు. అదనంగా మరో 300 మందికి గాయాలయ్యాయి. వారంతా ప్రస్తుతం హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రకంపనలు వల్ల అనేక మంది ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఆందోళనకు గురయ్యారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన చారిత్రాత్మక మరాకెచ్ లోని పాతబస్తీ చుట్టూ ఉన్న భవనాలు శిథిలాలు, దుమ్ము, ధూళితో నిండిపోయాయి. ప్రసిద్ధ ఎరుపు గోడల భాగాలు కూడా దెబ్బతిన్నట్టు అక్కడి నుంచి విడుదలైన వీడియోల్లో కనిపిస్తోంది.
