ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న మన పొరుగు దేశం శ్రీలంకకు భారత దేశం చేయూతనందించింది. ఆ దేశానికి 1 బిలియన్ డాలర్ల రుణాన్ని అందించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ రుణాన్ని అందజేసింది.
న్యూఢిల్లీ : అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ద్వీప దేశం శ్రీలంక (Sri Lanka)కు భారత్ (India) సహాయం చేసింది. ఆ దేశానికి భారత్ గురువారం 1 బిలియన్ డాలర్ల స్వల్పకాలిక రాయితీ అందించింది. విదేశీ మారకద్రవ్యం కొరత కారణంగా శ్రీలంక ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడింది.
భారత్ కు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (state bank of india) ద్వారా శ్రీలంక ప్రభుత్వానికి 1 బిలియన్లు రుణాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకం చేసేందుకు నిర్వహించిన కార్యక్రమంలో శ్రీలంక ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సే పాల్గొన్నారు. ఈ జనవరి నుంచి భారత్ శ్రీలంకకు మొత్తం 2.4 బిలియన్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించింది.
శ్రీలంక ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సే (Basil Rajapaksa) పర్యటన సందర్భంగా గురువారం రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘‘ స్వల్పకాలిక రాయితీ రుణ సౌకర్యం’’ అందించింది. ఈ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (External Affairs Minister S Jaishankar) కూడా హాజరయ్యారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంపై ప్రతిపక్షాల సామూహిక నిరసనలు చేపట్టాయి. ఈ సమయంలో భారతదేశం నుంచి ఆహారం, మందులు, ఇతర అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి రుణ పరిమితి పొడగించారు.
ఇటీవలి వారాల్లో చమురు కొనుగోళ్ల కోసం శ్రీలంకకు భారతదేశం 500 మిలియన్ల డాలర్ల రుణాన్ని అందించింది. దీంతో పాటు సార్క్ సౌకర్యం కింద 400 మిలియన డాలర్ల కరెన్సీ మార్పిడిని అందించింది. ఆసియన్ క్లియరింగ్ యూనియన్ చెల్లించాల్సిన 515 మిలియన్ డాలర్ల చెల్లింపును కూడా వాయిదా వేసింది. గత డిసెంబరులో శ్రీలంక ఆర్థిక మంత్రి రాజపక్సే భారతదేశ పర్యటన సందర్భంగా ఇరుపక్షాలతో ఖరారు చేయబడిన నాలుగు స్తంభాల ఆర్థిక సహకార ఏర్పాటులో ఈ 1-బిలియన్ రుణం అనేది కీలకమైన అంశం.
శ్రీలంకలో విదేశీ నిల్వలు క్షీణించడంతో దాని కరెన్సీని ఆ దేశం సమర్థవంతంగా తగ్గిస్తోంది. ఆ దేశం తన రుణాన్ని తీర్చడానికి, దిగుమతులకు డబ్బులు చెల్లించడానికి కష్టపడుతోంది. గత శనివారం శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ వాణిజ్య పరిమితులను కఠినతరం చేసింది. దేశంలో క్షీణిస్తున్న ఫారెక్స్ నిల్వలను మెరుగుపరచడానికి లావాదేవీలు జరిపిన 180 రోజులలోపు విదేశీ మారక ఆదాయాన్ని స్వదేశానికి తరలించాలని ఎగుమతిదారులను ఆదేశించింది.
BIMSTEC మంత్రివర్గ సమావేశం కోసం భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్ ఈ నెలాఖరులో కొలంబోకు వెళ్లనున్నారు. భారత్ అత్యవసర ఆర్థిక సహాయంతో పాటు, పునరుత్పాదక శక్తి, నౌకాశ్రయాలు, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీలలో భారత్ పెట్టుబడులు పెట్టి శ్రీలంక తన ఆర్థిక వ్యవస్థను బాగుచేసే సామర్థ్యాన్ని సమగ్రంగా నిర్మించడంలో సహాయపడతాయని కేంద్ర ప్రభుత్వం ఆ దేశానికి తెలియజేసింది. ప్రస్తుతం కేవలం 2.31 బిలియన్ల డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలతో ఆ దేశం ఇంధనం, ఆహారం, మందులతో ఇతర ముఖ్యమైన వస్తువులను దిగుమతులకు డబ్బు చెల్లించేందుకు కష్టపడుతోంది.
