శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని అక్కడి అధికార వర్గాలు ధ్రువీకరించాయి. అయితే గోటబయ రాజపక్స ఆ దేశం విడిచి మాల్దీవులు వెళ్లేందుకు భారత్ సాయం చేసిందనే ప్రచారాన్ని కొందరు తెరపైకి తెచ్చారు. దీనిపై శ్రీలంకలోని భారత హైకమిషన్ ట్విట్టర్ వేదికగా స్పందించింది.
శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి వెళ్లిపోయారు.తన భార్య Ioma Rajapaksa, ఇద్దరు బాడీ గార్డ్స్‌తో సహా ఎయిర్‌పోర్స్ విమానంలో గోటబయ రాజపక్స దేశాన్ని వీడారు. ఈ విషయాన్ని అక్కడి అధికార వర్గాలు ధ్రువీకరించాయి. గోటబయ రాజపక్స బుధవారం తన పదవికి రాజీనామా చేయనున్నట్టుగా ఇదివరకే ప్రకటించి సంగతి తెలిసిందే. అయితే రాజీనామా చేయడానికి కొన్ని గంటల ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షుడికి ఉన్న కార్యనిర్వాహక అధికారాల ప్రకారం ఈ చర్య జరిగిందని శ్రీలంక వైమానిక దళం కూడా ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీలంకను విడిచి వెళ్లిన గోటబయ రాజపక్స బుధవారం తెల్లవారుజామున మాల్దీవులు చేరుకున్నారు. అక్కడి వెలనా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే దేశం విడిచి వెళ్లినట్లు శ్రీలంక ప్రధానమంత్రి కార్యాలయం కూడా ధ్రువీకరించింది.
ఇదిలా ఉంటే.. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఆ దేశం విడిచి మాల్దీవులు వెళ్లేందుకు భారత్ సాయం చేసిందనే ప్రచారాన్ని కొందరు తెరపైకి తెచ్చారు. అయితే ఆ ప్రచారాన్ని శ్రీలంకలోని భారత హైకమిషన్ ఖండించింది. అటువంటి ప్రచారం నిరాధారమైనదని పేర్కొన్న భారత హైకమిషన్.. ఊహజనిత మీడియా నివేదికలను తోసిపుచ్చింది. ‘‘గోటబయ రాజకపక్స శ్రీలంకను విడిచి వెళ్లే ప్రయాణాన్ని భారతదేశం సులభతరం చేసిందని నిరాధారమైన, ఊహాజనిత మీడియా నివేదికలను హైకమిషన్ నిర్ద్వంద్వంగా ఖండించింది’’ అని శ్రీలంకలోని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది.
అదే సమయంలో.. ప్రజాస్వామ్య విలువలు, సంస్థాగత ప్రజాస్వామ్య సంస్థలు, రాజ్యాంగ ఫ్రేమ్‌వర్క్ ద్వారా శ్రేయస్సు మరియు పురోగతిని సాధించాలని ఆకాంక్షిస్తున్న శ్రీలంక ప్రజలకు భారతదేశం మద్దతును కొనసాగిస్తుందని భారత హైకమిషన్ పునరుద్ఘాటించింది.
ఇక, శ్రీలంక స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఎన్నడూ లేనంతగా అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే నెలలో మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక, జూలై 9న అధ్యక్ష భవన్‌లోకి వేలాది మంది ప్రజలు దూసుకు వచ్చారు. ఈ క్రమంలోనే మూడు రోజుల పాటు శ్రీలంకలోనే తలదాల్చుకున్న అధ్యక్షుడు గోటబయ రాజపక్స.. ఎట్టకేలకు దేశం విడిచి పారిపోయారు.
ఇక, జూలై 20న పార్లమెంటులో ఓటింగ్ ద్వారా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని రాజకీయ పార్టీల నేతలు నిర్ణయించుకున్నట్లు శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబేవర్దన తెలిపారు. జూలై 20న పార్లమెంటు ద్వారా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే ఈరోజు తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూలై 19న అధ్యక్ష పదవికి నామినేషన్లు కోరనున్నారు.
