జమ్మూ కాశ్మీర్‌లోని వైమానిక స్థావరాలపై వరుస డ్రోన్ దాడుల నేపథ్యంలో భారత్ దీనిని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది. ఉగ్రవాద కార్యకలాపాలకు డ్రోన్లు వాడడం అత్యంత తీవ్రమైన విషయమని పేర్కొంది.
జమ్మూ కాశ్మీర్‌లోని వైమానిక స్థావరాలపై వరుస డ్రోన్ దాడుల నేపథ్యంలో భారత్ దీనిని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది. ఉగ్రవాద కార్యకలాపాలకు డ్రోన్లు వాడడం అత్యంత తీవ్రమైన విషయమని పేర్కొంది. వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సభ్యదేశాలకు చెప్పింది.
సమాచార సాంకేతిక రంగాన్ని నేడు దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు కేంద్ర హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత) వి.ఎస్.కె. కౌముది . ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి వాటితో ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తున్నారని... వాటి ద్వారా ఉగ్రవాదులను నియమించుకుంటున్నారని ఆయన అన్నారు. పేమెంట్ పద్ధతులు, క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫాంలనూ డబ్బుల కోసం ఉగ్రవాద సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయని కౌముది పేర్కొన్నారు.
Also Read:జమ్మూ సుంజావన్ మిలటరీ స్టేషన్ వద్ద మరో డ్రోన్.. !
కొత్త టెక్నాలజీ ఏది వచ్చినా ఉగ్రవాదులు వాటిని దుర్వినియోగ పరుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు మానవాళికి ఉగ్రవాదంతో పొంచి ఉన్న పెను ముప్పు ఇదేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలోని సభ్య దేశాల ఉగ్రవాద వ్యతిరేక సంస్థల అధిపతులతో నిర్వహించిన రెండో అత్యున్నత స్థాయి సదస్సులో కౌముది పాల్గొన్నారు. తక్కువ ధరకే రావడం, సులభంగా వాటిని వాడుకోగలగడం వంటి కారణాలతో ఉగ్రవాదులు డ్రోన్లను దుశ్చర్యలకు వినియోగిస్తున్నారని ఆయన చెప్పారు.
నిఘా సమాచార సేకరణ, ఆయుధాలు, పేలుడు పదార్థాల చేరవేత, లక్షిత దాడులకు వాటిని ఎక్కువగా వినియోగిస్తున్నారని కౌముది ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భద్రతా సంస్థలకు పెను సవాళ్లు, ముప్పు ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. వ్యూహాత్మక, వాణిజ్య సంబంధిత ఆస్తులపై డ్రోన్లతో దాడి చేస్తున్న ఘటనలపై సభ్య దేశాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కౌముది పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ, రోబోటిక్స్, డీప్ ఫేక్స్, బ్లాక్ చెయిన్, డార్క్ వెబ్ వంటి వాటితో ఉగ్రవాదులు అకృత్యాలకు తెగబడుతున్నారన్నారు.
