శత్రువునయినా ఆపదలో ఉంటె కాపాడమని చెబుతుంది భారతీయ ధర్మం. భారత దేశంలోని అన్ని మతాల్లోని సారాంశం కూడా ఇదే. ఇతిహాస పురాణాల నుంచి మొదలుకొని చరిత్రలోని పాఠాల వరకు అన్ని నేర్పేది ఇదే. 

ఇప్పుడు భారత దేశం అదే నీతిని ప్రదర్శించింది. ఆపదలో ఉన్నది శత్రువు అయినా సరే, సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. భారత బద్ధ విరోధి పాకిస్థాన్ కి కూడా సహాయం చేస్తామంటూ భారత్ ఆపన్న హస్తం అందించింది. 

కరోనా వైరస్‌ వల్ల  ప్రపంచమంతా వణికిపోతున్న విషయం తెలిసిందే. అన్ని దేశాలు కూడా చైనాలో చిక్కుబడిపోయిన తమ దేశస్థులను వెనక్కి తీసుకొచ్చుకోవడానికి చేయగలిగినన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. 

కరోనా వైరస్ తొలిసారిగా బయటపడినట్టుగా భావిస్తున్న వూహాన్‌లో చిక్కుకుపోయిన పాకిస్తాన్ విద్యార్థులను ఆదుకునేందుకు భారత సర్కార్ ముందుకు వచ్చింది. పాక్ విద్యార్థులను ఇస్లామాబాద్ తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని రాజ్యసభలో విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. 

Also read: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్: 400 యేండ్ల కిందే చెప్పిన బ్రహ్మం గారు

వూహాన్‌కు రెండు విమానాలను పంపామని., అక్కడ ఉన్న భారతీయులతో పాటుగా పొరుగుదేశాలకు చెందిన వారిని కూడా తీసుకువస్తామని మంత్రి అన్నారు. రూపా గంగూలీ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... ఆయన ఈ సమాధానమిచ్చారు.  

మరొపక్కనేమో, భారత్ ఇటీవలే చైనా నుంచి సుమారు 600 మంది భారతీయులను,  ఏడుగురు మాల్దీవ్స్ దేశస్థులను  వెనక్కి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇతర దేశాలు కూడా తమ దేశీయులను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేసాయి. 

ఇప్పటికే అగ్రదేశాలు తమ వారిని తరలించుకుపోగా భారత్ తోపాటుగా సుడాన్, ఇండోనేషియా ప్రభుత్వాలు కూడా తమ జాతీయులను తరలించాయి. 

పాకిస్థాన్ మాత్రం కరోనా వైరస్ లాంటి మహమ్మారిని ఎదుర్కునే శక్తి తమ దేశానికి లేదని తెలుపుతూ... పాక్ విద్యార్థులంతా అక్కడే ఉండిపోవాలని చేతులెత్తేసింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ సర్కార్‌పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పాకిస్థాన్ లో కూడా ఇమ్రాన్ ఖాన్ పై తీవ్రస్థాయిలో ప్రజలు విరుచుకుపడుతున్నారు. 

చైనాలో చిక్కుబడిపోయిన తమ వారిని వెనక్కి తీసుకురావాలని వారి కుటుంబీకులు గుండెలవిసేలా రోదిస్తూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నా ఇమ్రాన్ ఖాన్ సర్కార్ మాత్రం కనికరం చూపెట్టిన పాపన పోవడం లేదు.