Asianet News TeluguAsianet News Telugu

ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ : మద్ధతుదారుల ఆందోళన , ఏకంగా ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌పై దాడి.. పాక్ చరిత్రలో ఇదే తొలిసారి

అవినీతి ఆరోపణలపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఆ దేశ ఆర్మీ మంగళవారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఆయన మద్ధతుదారులు ఆందోళనకు దిగారు. ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌పై దాడికి పాల్పడ్డారు.

Imran Khan supporters attack on Pakistan Army HQ and Lahore corps commanders house ksp
Author
First Published May 9, 2023, 8:00 PM IST

అవినీతి ఆరోపణలపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఆ దేశ ఆర్మీ మంగళవారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేసే సమయంలో సాయుధ బలగాలు తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. ఇమ్రాన్ మద్ధతుదారులు ఆర్మీని అడ్డుకున్నారు. అయినప్పటికీ సైన్యం.. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేశాయి. ఆ వెంటనే ఇమ్రాన్ ఖాన్ మద్ధతు, పీటీఐ కార్యకర్తలు పాక్‌లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలకు దిగారు. ఇమ్రాన్‌ను తక్షణం విడుదల చేయాలంటూ రోడ్డెక్కారు. కొన్ని చోట్ల ఈ ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. 

ఈ క్రమంలోనే ఇమ్రాన్ మద్ధతుదారులు లాహోర్ కంటోన్మెంట్‌లోని కార్ప్స్ కమాండర్స్ హౌస్‌లోకి చొరబడ్డారు. ఇమ్రాన్‌ను వేధించవద్దని హెచ్చరించారు. అంతేకాకుండా ఆర్మీ ప్రధాన కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న ఇమ్రాన్ అభిమానులు రాళ్లు రువ్వారు. పాకిస్తాన్ చరిత్రలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌పై దాడి జరగడం ఇదే తొలిసారి. ఆందోళనకారులు రుళ్లు రువ్వడం , ఉద్రిక్త పరిస్ధితులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

గత ఏడాది ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధానమంత్రి పదవి నుండి తొలగించబడిన తర్వాత ఇమ్రాన్ ఖాన్‌పై దాదాపు 100కు పైగా కేసులు నమోదయ్యాయి. రష్యా, చైనా , ఆఫ్ఘనిస్తాన్‌లకు సంబంధించి తన స్వతంత్ర విదేశాంగ విధాన నిర్ణయాల కారణంగా అమెరికా నేతృత్వంలోని కొన్ని దేశాలు తనను లక్ష్యంగా చేసుకున్నాయని ఇమ్రాన్ ఖార్ ఆరోపించారు. 
 

 

అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసుకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్‌ను మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్ట్ ఆవరణలోనే అరెస్ట్ చేశారు. తనపై సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ హత్యాయత్నానికి కుట్రపన్నారంటూ ఇమ్రాన్ చేసిన ఆరోపణలను సైన్యం ఖండించిన మరుసటి రోజే ఆయనను అరెస్ట్ చేశారు. 

అసలేంటీ అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసు :

ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీతో పాటు వారి సన్నిహితులు జుల్ఫికర్ బుఖారీ, బాబార్ అవాన్‌లు పంజాబ్‌లోని జీలం జిల్లాలో వున్న సోవాహ తహసీల్‌లో నాణ్యమైన విద్యను అందించడానికి అల్ ఖాదిర్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించే లక్ష్యంతో అల్ ఖాదిర్ ప్రాజెక్ట్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. కొన్ని పత్రాలలో ట్రస్ట్ కార్యాలయ చిరునామా బానీగాలా హౌస్ , ఇస్లామాబాద్‌గా పేర్కొన్నారు. బుష్రా బీబీ 2019లో ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన బహ్రియా టౌన్ నుంచి విరాళాలు స్వీకరించడానికి ఒక మెమోరాండపై సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా బహ్రియా టౌన్ నుంచి 458 కెనాల్స్, 4 మార్లాస్, 58 చదరపు అడుగుల భూమిని స్వీకరించింది. 

అయితే, పాక్ అంతర్గత మంత్రి రాణా సనావుల్లా ప్రకారం.. ఈ 458 కెనాల్స్ భూమిలో, ఇమ్రాన్ ఖాన్ దాని వాటాలను ఫిక్స్ చేశారు. అనంతరం విరాళంగా ఇచ్చిన భూమిలో 240 కెనాల్స్‌ను బుష్రా బీబీకి సన్నిహితురాలు ఫరా గోగి పేరు మీద బదిలీ చేశారు. ఈ భూమి విలువను తక్కువగా అంచనా వేయబడటంతో పాటు ఇమ్రాన్ తన వాటాను విశ్వవిద్యాలయం పేరుతో పొందాడు. అంతేకాదు.. మాజీ ప్రధాని ఈ విషయాన్ని తొక్కిపెట్టడానికి ప్రయత్నించారని సనావుల్లా పేర్కొన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios