పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు హైకోర్టులో ఊరట దక్కింది.  తోషఖానా కేసులో  ట్రయల్ కోర్టు ఇచ్చిన మూడేళ్ల జైలు శిక్షను  హైకోర్టు సస్పెండ్ చేసింది. 


ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఇస్లామాబాద్ హైకోర్టులో ఊరట దక్కింది. జిల్లా కోర్టు వేసిన జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు మంగళవారంనాడు సస్పెండ్ చేసింది. అంతేకాదు జైలు నుండి ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని కూడ హైకోర్టు ఆదేశించింది. తోషఖానా కేసులో ఈ ఏడాది ఆగస్టు 5న ఇమ్రాన్ ఖాన్ కు మూడేళ్ల జైలు శిక్షను విధించింది కోర్టు.

ఇస్లామాబాద్ ప్రధాన న్యాయమూర్తి అమీర్ ఫరూక్, జస్టిస్ తారిఖ్ మెహమూద్ జహంగిరితో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం నాడు ఈ తీర్పును రిజర్వ్ చేశారు.ఇవాళ ఈ విషయమై ఈ తీర్పును హైకోర్టు వెల్లడించింది. జిల్లా కోర్టు నిర్ణయాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు సస్పెండ్ చేసిందని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ ప్రకటించింది. 

కింది కోర్టు తీర్పును హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ సవాల్ చేశారు. ఈ విషయమై ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత సోమవారంనాడు తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఇస్లామాబాద్ లోని ట్రయల్ కోర్టు ఇమ్రాన్ ఖాన్ ను దోషిగా నిర్ధారించి ఆగస్టు 5 మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

2018-2022 కాలంలో వచ్చిన బహుమతుల విక్రయంలో చట్టవిరుద్దంగా వ్యవహరించారని ఇమ్రాన్ ఖాన్ కు శిక్ష విధించింది కోర్టు. అంతేకాదు ఎన్నికల్లో ఐదేళ్ల పాటు పోటీ చేయకుండా నిషేధం విధించింది.