అధికారం పోయిన నాటి నుంచి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ సభ్యులు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ప్రత్యర్ధులపై భౌతికదాడులకు దిగుతున్నారు. తాజాగా పాకిస్తాన్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజారీపై దాడికి దిగారు.
ఇటీవల రాజకీయ సంక్షోభంతో దాయాది దేశం పాకిస్తాన్ (pakistan) అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ (imran khan) ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం పాకిస్తాన్ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లాహోర్ కోర్టు (lahore high court) ఆదేశాల మేరకు కొత్త సీఎంను ఎన్నుకునేందుకు పంజాబ్ అసెంబ్లీ (punjab assembly) శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది.
ఈ సందర్భంగా సభ జరుగుతుండగా.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) (pakistan tehreek-e-insaf) సభ్యులు బీభత్సం సృష్టించారు. గట్టిగా అరుస్తూ డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజారీపై దాడికి దిగారు. ఆయనపైకి పువ్వులు విసురుతూ, జుట్టు పట్టుకుని లాగుతూ, చెంపపై కొడుతూ వీరంగం వేశారు. ఆ సమయంలో పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డులు కూడా వీరిని అడ్డుకోలేకపోయారు.
అదే సమయంలో పీటీఐ, పీఎంఎల్‌క్యూ సభ్యులు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాడి నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజారీ భద్రతా సిబ్బంది రక్షణలో సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం సభలో చోటుచేసుకున్న పరిణామాలపై విపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హంజా షాబాజ్, చౌదరి పర్వేజ్ ఇలాహిలు సీఎం రేసులో నిలిచారు. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిన సెషన్‌కు దోస్త్ మహ్మద్ మజారీ అధ్యక్షత వహించారు. హమ్జా PML N ఇతర పార్టీల సంయుక్త అభ్యర్థి. ముందస్తు ఎన్నికలకు, డిప్యూటీ స్పీకర్ అధికారాలను పునరుద్ధరించడానికి హంజా చేసిన అభ్యర్థనను లాహోర్ హైకోర్టు తోసిపుచ్చింది.
అసెంబ్లీలో జరిగిన రచ్చకి పాకిస్థాన్ అసెంబ్లీ సభ్యుడు అహ్సన్ ఇక్బాల్ మాజీ ప్రధానిపై విరుచుకుపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ అన్నిస్థాయిల్లో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎన్నికను అడ్డుకునేందుకు అసెంబ్లీలో హింసను ప్రేరేపించారని అహ్సన్ ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ హిట్లర్ శిష్యుడినని నిరూపించుకుంటున్నాడంటూ ట్వీట్ చేశారు. కాగా పాకిస్థాన్‌లో నాటకీయ పరిణామాల మధ్య ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా వైదొలిగారు. అయినా సరే పాకిస్థాన్‌లో రాజకీయ అస్థిరత కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇరు పార్టీల సభ్యులు గొడవలకు, ఘర్షణలకు దిగుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ స్టార్ హోటల్లో ఇఫ్తార్ విందుకు హాజరైన ఇరు పార్టీల నేతలు కొట్టుకోవడం కలకలం రేపింది.
