పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఆ దేశ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ నైతిక మద్దతు అందించారు. ఆయన ఇంకా అవుట్ కాలేదని చెప్పారు. ఆట ఇంకా మిగిలే ఉందని అన్నారు. ఈ మేరకు వసీం అక్రమ్ ట్వీట్ చేశారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పాక్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ మద్దతుగా నిలిచారు. ఇమ్రాన్ ఇంకా ఓడిపోలేదని, ఆట ఇంకా మిగిలే ఉందని అన్నారు. ఆయన పోరడటానికి, గెలవడానికే జన్మించారని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కొంటున్న ఇలాంటి రాజకీయ సంక్లిష్ట పరిస్థితుల్లో ఈ మాటలు ఆయనకు ఎంతో స్వాంతన చేకూర్చే అవకాశం ఉంది.
వసీం అక్రమ్ ఖాన్ పాక్ క్రికెట్ టీంకు గతంలో కెప్టెన్ గా ఉన్నారు. ప్రస్తుత పీఎం ఇమ్రాన్ ఖాన్, ఆయన కలిసి ఎన్నో క్రికెట్ మ్యాచ్ లు ఆడారు. దీంతో వారి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. ప్రస్తుతం 55 ఏళ్ల వసీం క్రికెట్ వ్యాఖ్యాతగా పని చేస్తున్నారు. అయితే పాక్ నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొని, అనంతరం తన ప్రభుత్వాన్ని రద్దు చేసిన కొన్ని గంటల తర్వాత ఇబ్బంది పడుతూ కనిపించిన పాక్ పీఎం ఫొటోను ట్వీట్ వసీం అక్రమ్ ట్వీట్ చేశారు.
‘‘ది గేమ్ ఛేంజర్ #ఇమ్రాన్‌ఖాన్ #స్కిప్పర్ #నాట్‌అవుట్ #సర్‌ప్రైజ్ ’’ అని మరో ట్వీట్ లో పేర్కొంటూ ఇమ్రాన్ ఖాన్ చక్కగా నవ్వుతున్న ఫొటోను షేర్ చేశారు. అంతకు ముందు తన సహచరుడైన ఇమ్రాన్ ఖాన్ కు తన మద్దతు ఇస్తూ ఇలా ట్వీట్ చేశాడు: “ అతను నాయకత్వం వహించడానికి, పోరాడటానికి, గెలవడానికి జన్మించాడు. తన కోసం కాకుండా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న దాని కోసం పోరాడుతాడు. అధికారం, పేరు కోసం కాదు. ఇది అతని విధి. ఆట ఇంకా ముగియలేదు. #IstandwithImranKhan #NeverGiveUp (sic) ” అంటూ పేర్కొన్నాడు.
పాకిస్థాన్ ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ మిత్రపక్షాలు క్రమంగా పక్కకు జరగడంతో, ప్రభుత్వాన్ని పడగొట్టే మెజారిటీ తమకు ఉందని ప్రతిపక్షం పేర్కొంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధమన్నారు నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరీ (qasim suri) ప్రకటించారు. అనంతరం ఓటింగ్ ను తిరస్కరించారు.
దీంతో వెంటనే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. అలాగే ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని సిఫారసు మేరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ (arif alvi) ప్రకటించారు. అయితే ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపాయి. కాగా ఇమ్రాన్ ఖాన్ ను షాక్ కు గురి చేస్తూ ఆ దేశ క్యాబినెట్ సెక్రటరీ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. పాక్ ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ఇమ్రాన్ ఖాన్ ను తొలిగించినట్టు అందులో తెలిపారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 48(1), ఆర్టికల్ 58(1) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు క్యాబినేట్ సెక్రటరీ చెప్పారు. ఇకపై ఇమ్రాన్‌ఖాన్ ప్రధానమంత్రి కాదని, దేశంలోని బ్యూరోక్రసీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నడుస్తోందని క్యాబినెట్ సెక్రటరీ నోట్ స్పష్టం చేసింది. ఇంకా ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
