పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌కు భారీ షాక్ తగిలింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్తాన్‌లోని స్థానిక కోర్టు దోషిగా నిర్దారించి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌కు భారీ షాక్ తగిలింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్‌లోని ట్రయల్ కోర్టు దోషిగా నిర్దారించి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా ఐదేళ్లపాటు క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఈ క్రమంలోనే ఇమ్రాన్ ఖాన్‌ను ఆయనకు చెందిన జమాన్ పార్క్ హౌస్ నుండి అరెస్టు చేసినట్లు పీటీఐ పార్టీ పేర్కొంది.
ఇక, తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ అవినీతికి పాల్పడినట్లు కోర్టు శనివారం ప్రకటించినట్టుగా పాకిస్థాన్ మీడియా రిపోర్టు చేసింది. అంతేకాకుండా మూడేళ్ల జైలు శిక్షతో పాటు.. రూ.లక్ష జరిమానా కూడా విధించింది. అలా చేయని పక్షంలో అదనంగా మరో ఆరు నెలలు జైలులో ఉండాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసేందుకు ఇస్లామాబాద్ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అయితే ఈ పరిణామాలపై ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ తీవ్రంగా స్పందించింది. చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడింది.
తోషాఖానా కేసు విషయానికి వస్తే.. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశీ ప్రముఖుల నుంచి పొందిన బహుమతులను అక్రమంగా విక్రయించారనే ఆరోపణలకు సంబంధించి కేసు. ఈ బహుమతులలో రాజకుటుంబం ఇచ్చిన గడియారాలు ఉన్నాయి. అయితే ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఎటువంటి తప్పు చేయలేదని చెప్పారు. తనపై ఆరోపణలను ఖండించారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ న్యాయ బృందం తక్షణమే అప్పీల్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ‘‘సాక్షులను హాజరుపరచడానికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. వాదనలను పూర్తి చేయడానికి సమయం కేటాయించబడలేదు’’ అని ఇమ్రాన్ ఖాన్ న్యాయ బృందంలోని సభ్యుడు ఒకరు చెప్పారు.
