సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు.. చాలా వేగంగా స్ప్రెడ్  అవుతూ ఉంటాయి. అవి నిజమో కాదో తెలుసుకోకుండానే..జనాలు కూడా వాటిని షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. రెండు రోజుల క్రితం ఇండోనేషియాలో విమానం కూలిందన్న వార్త చదివే ఉంటారు. విమానంలో ప్రయాణించే దాదాపు 189మంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే.. ఈ ప్రమాదంలో ఓ పసిపాప ప్రాణాలతో బయటపడిందని ఓ వార్త గత రెండు రోజులుగా హల్‌చల్‌ చేస్తోంది. ఆ పసిపాకు సంబంధించిన ఫొటో కూడా విపరీతంగా ట్రెండ్‌ అయింది. ప్రమాదం జరిగిన 24 గంటల్లోనే ఈ వార్తకు సంబంధించిన పోస్ట్‌ ఐదు వేల సార్లు షేర్‌ కావడం గమనార్హం. 

ఈ పోస్ట్‌లో .. ‘ఈ పాపను రక్షించిన ఆ దేవుడికి కృతజ్ఞతలు. జేటీ610 విమాన ప్రమాదంలో బతికిన చిన్నారి. ఆమె తల్లి లైఫ్‌ జాకెట్‌తో కవర్‌ చేయడంతో ప్రాణాలతో బయట పడింది. దురదృష్టవశాత్తు ఆ పాప తల్లిని  ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు.’ అని క్యాప్షన్‌గా పేర్కొంటు ఓ పసిపాప ఫొటోను ట్రెండ్‌ చేశారు.

అయితే ఆ పాప ఈ ఏడాది జూలైలో ఇండోనేషియాలోనే చోటుచేసుకున్న నౌక ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన పాపని, ఆ ఫొటోనే తాజా ప్రమాదానికి ముడిపెడుతూ వైరల్‌ చేశారని ఆదేశ విపత్తు ఉపశమన సంస్థ అధికార ప్రతినిధి సుటోపా ట్విటర్‌ వేదికగా స్పష్టం చేశారు. ఇది ఒక గాలివార్తని, ఇలాంటి పుకార్లను నమ్మి, ప్రచారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.