పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం.. 30 నిమిషాల్లో మూడు సార్లు ప్రకంపనలు.. 6.2 తీవ్రత నమోదు..
పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ లో శనివారం వరుసగా 3 భూకంపాలు వచ్చాయి. 30 నిమిషాల్లో వచ్చిన వరుస ప్రకంపన వల్ల స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై వీటి తీవ్రత అత్యధికంగా 6.2గా నమోదు అయ్యింది.
పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. 30 నిమిషాల్లో మూడు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.2గా నమోదు అయ్యిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. హెరాత్ నగరానికి వాయవ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని, మొత్తంగా 5.5, 4.7, 6.2 తీవ్రతతో మూడు ప్రకంపనలు వచ్చాయని యూఎస్జీఎస్ పేర్కొందని ‘డాన్’ నివేదించింది.
ఉదయం 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలకు) మొదటి భూకంపం సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న నివాసితులు, దుకాణదారులు భవనాలను వదిలి పారిపోయారని అక్కడ ఉన్న ఏఎఫ్ పీ జర్నలిస్టు ఒకరు చెప్పారు. అయితే ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలేవీ లేవని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రకంపనల వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మహిళలు, పురుషులు, చిన్నారులు అందరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. తిరిగి లోపలకు వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడలేదు. అయితే ఈ ప్రకంపనల వల్ల మరణాలు సంభవించే అవకాశం ఉందని యూఎస్జీఎస్ ప్రాథమిక నివేదిక తెలిపింది.
ఈ భూకంపం సంభవించిన హెరాత్ ప్రాంతం ఇరాన్ సరిహద్దుకు తూర్పున 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని ఆఫ్ఘనిస్తాన్ సాంస్కృతిక రాజధానిగా పరిగణిస్తారు. ఇక్కడ 1.9 మిలియన్ల జనాభా నివసిస్తోందని 2019 ప్రపంచ బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి. కాగా.. గత ఏడాది జూన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో 5.9 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 1,000 మందికి పైగా మరణించగా.. పదుల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
అలాగే ఈ ఏడాది మార్చిలో ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్ లోని జుర్మ్ సమీపంలో 6.5 తీవ్రతతో సంభవించింది. ఈ ప్రకంపనలు ధాటికి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ లలో 13 మంది మరణించారు. ఆఫ్ఘనిస్తాన్ తరచుగా భూకంపాలు వస్తుంటాయి. ఎందుకంటే ఈ దేశం హిందూ కుష్ పర్వత శ్రేణిలో.. యురేషియా, భారత టెక్టోనిక్ ప్లేట్ల కూడలికి సమీపంలో ఉంది. కాగా.. 2021 లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి విదేశీ సహాయాన్ని విస్తృతంగా ఉపసంహరించుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన మానవతా సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.