గుహలో చిక్కిపోయిన 12 మంది: 4 నెలలు అక్కడే?

HOW TO GET THAILAND FOOTBALL TEAM OUT OF CAVE, SAFELY
Highlights

థాయ్‌లాండ్ గుహల్లో అదృశ్యమైన 12 మంది విద్యార్థులు మరియు వారి ఫుట్‌బాల్ కోచ్‌ను తొమ్మిది రోజుల తర్వాత రెస్క్యూ టీమ్ సజీవంగా గుర్తించిన సంగతి తెలిసినదే.

థాయ్‌లాండ్ గుహల్లో అదృశ్యమైన 12 మంది విద్యార్థులు మరియు వారి ఫుట్‌బాల్ కోచ్‌ను తొమ్మిది రోజుల తర్వాత రెస్క్యూ టీమ్ సజీవంగా గుర్తించిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు వీరిని ఈ గుహల నుంచి బయటకు తీసుకురావటం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం గజ ఈతగాళ్లు ఆ బాలురున్న చోటుకు చేరుకొని, వారికి కావల్సిన మందులు, ఆహార పధార్థాలను అందజేశారు. ఈ రెస్క్యూ టీమ్‌లో ఓ వైద్యుడు, ఓ నర్సుతో పాటుగా మరో ఐదుగురు అక్కడికి చేరుకున్నారు.

పిల్లల ఆరోగ్యాన్ని పరీక్షించిన వైద్యుడు, వీరిలో ఎవ్వరూ ప్రాణాపాయ స్థితిలో లేరని గుహ వెలుపల ఉన్న అధికారులకు సమాచారం ఇచ్చారు. సులభంగా జీర్ణమయ్యే, అధిక శక్తినిచ్చే ఆహారాన్ని వారికి అందించినట్లు తెలిపారు. గుహలో వరద నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో వీరిని సజీవంగా బయటకు తీసుకురావటం చాలా కష్టమవుతోంది. మరోవైపు రానున్న రోజుల్లో వర్షాలు ఇంకా ఉద్ధృతమయ్యే సూచనలుండడంతో వారున్న ప్రాంతం చుట్టూ నీటి మట్టం పెరిగితే గుహలో ఆక్సిజన్ లభ్యత తగ్గుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

గడచిన పది రోజులుగా గుహలో చిక్కుకొని ఉన్న వీరు బయటకు రావాలంటే ప్రస్తుతం రెండే మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి నీటిని ఈదుకుంటూ బయటకు రావటం. కానీ ఇలా చేయాలంటే వారు ఎంతో నైపుణ్యం కలిగిన గజ ఈతగాళ్లై ఉండాలి. ప్రస్తుతం వారున్న పరిస్థితుల్లో అలాంటి నైపుణ్యం పెంచేలా శిక్షణ ఇవ్వడం కష్టమని చెబుతున్నారు.

రెండవ ఆప్షన్ విషయానికి వస్తే.. గుహలోని వరద నీటిని పూర్తిగా తోడేసి, ఆ తర్వాత వారిని బయటకు తీసుకురాల్సి ఉంటుంది. గుహలోని నీటిని మొత్తం తోడేయాలంటే సుమారు నాలుగు నెలల సమయం పడుతుందని, అప్పటి వరకూ ఈ బాలలకు అవసరమయ్యే ఆహారాన్ని గుహలోకి పంపించాల్సి ఉంటుందని రెస్క్యూ అధికారులు అంటున్నారు. మరోవైపు, ఈ గుహలో చిక్కుకున్న పిల్లలతో వారి తల్లిదండ్రులు మాట్లాడేందుకు వీలుగా వారు చిక్కుకున్న ప్రదేశానికి ఓ ఫోన్ లైన్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నాంగ్ నాన్ పర్వతం కింద ఉన్న ఈ గుహలు దాదాపు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్నో మలుపులు, చీలికలతో కూడి ఉంటాయి. ఈ గుహల్లోకి ప్రవేశిస్తే తిరిగి సజీవంగా రావటం చాలా కష్టం. వర్షాకాలంలో ఈ గుహలు వరద నీటితో నిండిపోతాయి. ఈ జూనియర్ ఫుట్‌బాల్ టీమ్ సభ్యులు, వారి కోచ్‌తో కలిసి జూన్ 23వ తేదీ శనివారం ఈ గుహల్లోకి వెళ్లారు. కానీ బయటకు రాలేదు. దీంతో వీరి కోసం భారీ ఎత్తున గాలింపు, సహాయ చర్యలు చేపట్టిన అధికారులు గత సోమవారం వీరంతా సజీవంగానే ఉన్నట్లు గుర్తించిన సంగతి తెలిసినదే.

loader