కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ లో మొదలైన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకేసింది. లక్షల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. ఈ వైరస్ పుట్టుకకు కారణమైన చైనా పై ఇతర దేశాలన్నీ మండిపడుతూనే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా అయితే.. ఏకంగా వైరస్ ని చైనా ల్యాబ్ లో పుట్టించిందంటూ విమర్శలు కూడా చేసింది.

అయితే.. తాజాగా.. ఈ వైరస్ గురించి ఓ విషయం వెలుగులోకి వచ్చింది. శాస్త్రవేత్తలు పేషెంట్‌ జీరో జాడ కోసం అన్వేషిస్తున్న క్రమంలో కరోనా గురించి చైనా అధికారింగా ప్రకటించే కంటే ముందే ఫ్రాన్స్‌లో కరోనా లక్షణాలతో బాధపడుతున్న పేషెంట్లను గుర్తించినట్టు ఓ అధ్యయనంలో తేలింది.

పారిస్‌లోని అవిసెనె అండ్‌ జీన్‌ వెర్డీర్‌ ఆస్పత్రిలో ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలతో బాధపడతున్న 14 మంది రోగుల నుంచి సేకరించిన నమూనాల్లో.. ఓ 42 ఏళ్ల వ్యక్తికి కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ యాంటీమైక్రోబియల్‌ ఏజెంట్స్‌ పేర్కొంది. 

సదరు పేషెంట్‌ డిసెంబరు 27న ఆస్పత్రిలో చేరాడని... అదే విధంగా అతడికి చైనాకు వెళ్లినట్లుగా ప్రయాణ చరిత్ర కూడా లేదని వెల్లడించింది. ఈ విషయం గురించి అవిసెనె ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ విభాగాధిపతి ఓలివెర్‌ బౌచర్డ్‌ మాట్లాడుతూ.. చాపకింద నీరులా వైరస్‌ ప్రజల్లో విస్తరించిందని.. అది తమకు సోకిందన్న విషయం కూడా చాలా మంది ప్రజలకు తెలియదని పేర్కొన్నారు.

ఇక ఈ పరిణామాల గురించి ఇటాలియన్‌ పరిశోధకులు మాట్లాడుతూ.. లాంబోర్డిలో జనవరి ఆరంభంలోనే వైరస్‌ ప్రవేశించిందని... అయితే ఫిబ్రవరి 20 తర్వాతే అక్కడ తొలి కేసు నమోదైందని పేర్కొన్నారు. మిలాన్‌ నుంచి వచ్చిన ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు డిసెంబరు ఆరంభంలోనే తమకు వైరస్‌ లక్షణాలు కనిపించాయని.. అయితే కొన్నాళ్ల తర్వాత ఎటువంటి చికిత్స లేకుండానే కోలుకున్నారని తెలిపారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అనంతరం వారికి సీరలాజికల్‌ టెస్టు(యాంటీ బాడీ టెస్టు) నిర్వహించగా.. రక్తంలో యాంటీబాడీస్‌ ఉత్పత్తి కావడం గుర్తించామని.. కరోనా వారి శరరీంలో ఎప్పుడు ప్రవేశించిందో.. ఎప్పుడు అంతమైపోయిందో వారికి కూడా తెలియలేదని పేర్కొన్నారు.