శక్తివంతమైన ఇజ్రాయెల్ నిఘా సంస్థలు ఎలా విఫలమయ్యాయి? హమాస్ ఎలా ప్లాన్ చేసింది?

ప్రపంచంలో శక్తివంతమైన నిఘా వ్యవస్థల్లో ఇజ్రాయెల్ సంస్థలు ఉంటాయి. షిన్ బెట్, మొస్సాద్ సంస్థలు పటిష్ట నిఘా సామర్థ్యాలను కలవి. వీటి ప్రధాన లక్ష్యంగా కచ్చితంగా శత్రువులైన హమాస్, పాలస్తీనాపైనే ఉంటాయి. కానీ, ఈ నిఘా నేత్రాలను తప్పించుకుని హమాస్ సాయుధులు ఇజ్రాయెల్ సరిహద్దు దాటి లోనికి చొచ్చుకువచ్చి విధ్వంసం సృష్టించాయి.
 

how powerful intelligence agency of israel failed in detecting hamas attack kms

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే శక్తివంతమైన నిఘా సంస్థల్లో ఇజ్రాయెల్‌కు చెందినవి తప్పకుండా ఉంటాయి. ఇజ్రాయెల్ మొస్సాద్ నిఘా సంస్థ గురించి ఇప్పటికీ కథలు కథలుగా వినిపిస్తూ ఉంటాయి. అంతటి శక్తివంతమైన ఇజ్రాయెల్ నిఘా సంస్థలను బహిరంగ కారాగారమైన గాజా పట్టిలోని హమాస్ ఎలా ఏమర్చింది? దాదాపు ఒంటిగా ఉంటున్న హమాస్ ప్రపంచంలోనే శక్తివంతమైన, సాంకేతికంగా ముందంజలో ఉండే, ముఖ్యంగా అమెరికా అండదండలున్న ఇజ్రాయెల్ నిఘా నుంచి ఎలా తప్పించుకుని ఆ దేశంలో అడుగు పెట్టింది. ప్రపంచ దేశాలన్నింటినీ నిర్ఘాంతపరిచేలా ఇజ్రాయెల్ దేశ సరిహద్దులోకి చొచ్చుకుని వచ్చి పౌరులను హమాస్ హతమార్చింది. పాలస్తీనా నుంచి ముప్పును పసిగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఉండీ ఇజ్రాయెల్ నిఘా, భద్రతా వ్యవస్థలు ఎలా వైఫల్యం చెందాయా? అనే చర్చ మొదలైంది.

ఇజ్రాయెల్ సరిహద్దులోకి దూసుకువచ్చి ఇజ్రాయెల్ పౌరులపై దాడులు చేసి, కొందరిని బందీలుగా హమాస్ తీసుకెళ్లిన ఘటనలో ఇజ్రాయెల్ అంతర్గత నిఘా షిన్ బెట్, బాహ్య నిఘా ఏజెన్సీ మొస్సాద్, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు విఫలమయ్యాయని నిపుణులు ఒప్పుకుంటున్నారు. హమాస్ ఇంతటి డేరింగ్ స్టెప్ తీసుకుంటుందని వారు ఊహించలేదు. పిడుగుపడినట్టుగా దేశ సరిహద్దు దాటి రక్తపాతాన్ని సృష్టించిన హమాస్‌ ఫైటర్లను అంతే వేగంగా ఎదుర్కోవడంలోనూ రక్షణ వ్యవస్థ అప్రమత్తం కాలేకపోయిందని, రంగంలోకి దూకలేకపోయిందని చెబుతున్నారు. ఇదొకవైపు ఉండగా, ఇంతకీ ఇజ్రాయెల్ నిఘాను హమాస్ ఎలా అధిగమించిందనే సంశయాలు కూడా వస్తున్నాయి.

నిజానికి ఇది అసాధ్యంగానే ఉండేది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలు అసమానం. భూగ్రహంపై అత్యధిక నిఘా ఉండే ప్రాంతం గాజా స్ట్రిప్. ఫోన్ లైన్స్ ట్యాప్ చేసే ఉంటాయి. శాటిలైట్లు ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉంటాయి. గాజాలోని చాలా మంది ఇన్ఫర్మేంట్లను ఇజ్రాయెల్ నిఘా సంస్థలు తయారు చేసుకున్నాయి. కానీ, వీటన్నింటినీ హమాస్ అధిగమించింది. ఈ లోపాలను సవరించుకోవడానికి ఇజ్రాయెల్, అమెరికాకు కొన్నేళ్లు పట్టవచ్చని చెబుతున్నారు.

సమాధానాలు లేని ప్రశ్నలు చాలానే ఉన్నా.. హమాస్ టెక్నాలజీని వాడకుండా చాలా వరకు మ్యానువల్‌గా పని చేసుకున్నదని చెప్పవచ్చు. వారి ఫోన్, మెయిల్ కమ్యూనికేషన్లను ఇజ్రాయెల్ ఈజీగా ట్యాప్ చేయవచ్చు. ఇన్నేళ్ల ఈ వ్యవహారంలో హమాస్ ఇజ్రాయెల్ సామర్థ్యాలను అంచనా వేయడమే కాదు, వాటిని తప్పించుకోవడాన్ని కూడా సాధన చేశారని తెలుస్తున్నది. ఇందుకోసం హమాస్ భారీ ఆపరేషన్‌కు వ్యూహ రచన చేసి ఉంటుందని అంటున్నారు. వారు చాలా గ్రూపులుగా విడిపోయి టాస్క్‌లను విభజించుకుని ఉంటారని, వారు ముఖాముఖిగా చర్చలు చేసుకుని ఉంటారని చెబుతున్నారు. సరిహద్దులోనికీ వారు తమ వెంటే పేలుడు పదార్థాలను తెచ్చుకుని ఉంటారని వివరిస్తున్నారు.

Also Read: ఇజ్రాయెల్ నుంచి వచ్చే ఒక్కో బాంబ్‌కు ఒక్కో బందీని చంపేస్తాం: హమాస్ వార్నింగ్

ఎన్‌క్రిప్టెడ్ టెక్నాలజీపై వారు ఆధారపడి ఉండొచ్చని, ఇజ్రాయెల్ శాటిలైట్ల కళ్లు గప్పడానికి వారు అండర్‌గ్రౌండ్‌లో భేటీలు చేసి ఉంటారని నిఘా నిపుణులు చెబుతున్నారు. వారి కమ్యూనికేషన్‌ను ఇజ్రాయెల్ నిఘా సంస్థల కంటపడకుండా చేసి ఏమాత్రం హెచ్చరికలు వెళ్లకుండా ఆపగలిగి ఉంటారని తెలిపారు. ఇజ్రాయెల్ ఉపగ్రహాల నిఘా నుంచి తప్పించుకోడానికి హమాస్ వాటి పేలుడు పదార్థాను భారీ గుహల్లో దాచి పెట్టుకుంటున్నదని కొన్ని వర్గాలు చెప్పాయి.

ఇజ్రాయెల్ నిఘా సంస్థలు చాలా వరకు టెక్నాలజీపైనే ఆధారపడి ఉండొచ్చని, హమాస్‌లో ఇన్ఫర్మేంట్లను తయారు చేసుకోవడంలో వెనుకబడి ఉండొచ్చని ఇంకొందరు తెలిపారు. ఇజ్రాయెల్ పై దాడి సంకేతాలనూ బయటికి పొక్కకుండా హమాస్ జాగ్రత్త పడింది. 2007 నుంచి హమాస్ కూడా దాని నిఘా పరికరాలకు పదునుపెట్టుకుంది. వేగంగా సామర్థ్యాలు పెంచుకుంది. అలాగే.. ఈ గ్రూపునకు శత్రు దేశంలోనూ ఇన్ఫర్మేంట్లు, ఏజెంట్లు విరివిగా ఏర్పాటు చేసుకుంది.

ఇజ్రాయెల్ సరిహద్దు కూడా చాలా వరకు నిర్మానుష్యంగా ఉంటుంది. ఉద్రిక్తపూరిత ఈ ఏరియాల్లో కెమెరాలు, గ్రౌండ్ మోషన్ సెన్సార్లు, ఆర్మీ పెట్రోలింగ్‌లు నిత్యం యాక్టివ్‌గా ఉంటాయి. సరిహద్దుకు సమీపంలో నివాసాలు చాలా తక్కువ. అయినా, సరిహద్దు ఫెన్స్ దాటి పరుగున వచ్చి పేల్చుకుని విధ్వంసం సృష్టించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే, ఇజ్రాయెల్ పెట్టుకున్న ‘స్మార్ట్ బారియర్’ ఫెన్స్ వైర్ గుండా హమాస్ సాయుధులు వచ్చినట్టు తెలుస్తున్నది. ఆ ఫెన్స్ వైర్‌కు కన్నాలు వేసి లోపలికి వచ్చారని, ఆ తర్వాత పెద్ద మొత్తంలో పారాగ్లైడర్ల ద్వారా ఇజ్రాయెల్‌లో అడుగు పెట్టి విధ్వంసం సృష్టించారని అనుమానిస్తున్నారు. సుమారు 1000 మంది హమాస్ సాయుధులు ఇజ్రాయెల్ గడ్డ మీదికి వచ్చి ఉంటారని భావిస్తున్నారు. 

Also Read: ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్ర విషాదం నింపిన భూకంపం..2,000 దాటిన మరణాల సంఖ్య.. సాయం కోసం తాలిబన్ల ఎదురచూపు

అలాగే, ఇజ్రాయెల్ హైటెక్నాలజీతో ఒక రకమైన ఏమరపాటు కూడా వచ్చిందని, ఇజ్రాయెల్ టెక్నాలజీ, సామర్థ్యాలకు తోడు హమాస్‌ను తక్కువ అంచనా వేయడం కొంత నిర్లక్ష్యానికి దారితీసిందని చెబుతున్నారు. ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ సామర్థ్యాలపై ఉన్న అశేష నమ్మకాన్ని కూడా హమాస్ తనకు అనుకూలంగా మార్చుకుని ఉంటుంది.

ఇజ్రాయెల్ నిఘాను ఎక్కువగా అంతర్గత విషయాల కోసం ఎక్కువగా ఉపయోగించుకున్నారని ఆ దేశ రాజకీయ నాయకులపైనా తీవ్ర విమర్శలు ఉన్నాయి. అందువల్లే హమాస్ పై ఫోకస్ తగ్గిందనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఎందుకంటే.. ఈ కాలంలో గాజా స్ట్రిప్‌కు పొరుగునే ఉండే మరో దేశం ఈజిప్ట్ దేశ నిఘా సంస్థలు మాత్రం ఆ దేశ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. హమాస్ ఒక భారీ ఆపరేషన్‌కు (సమ్‌థింగ్ బిగ్) ప్లాన్ చేస్తున్నదని పలుమార్లు హెచ్చరికలు చేసింది. కానీ, ఇజ్రాయెల్‌కు ఇలాంటి హెచ్చరికలు రాలేవా? వచ్చినా దేశంలోపటి రాజకీయాల్లో మునిగిన ప్రభుత్వాలు సకాలంలో స్పందించలేవా? అనే ప్రశ్నలకు ఇప్పుడే సమాధానాలు దొరక్కపోవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios