రెండో దశలోకి అడుగుపెట్టిన హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం.. తమది మనుగడ కోసం పోరాటమన్న నెతన్యాహు

పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ తో తమ దేశ దళాలు చేస్తున్న యుద్ధం రెండో దశలోకి ప్రవేశించిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. తమ దేశం మనగడ కోసం పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. తమ సైన్యం పోరాటం చేయని వారిని ఏమీ చేయబోదని స్పష్టం చేశారు.

Hamas -Israel war has entered the second stage..Netanyahu says it is their fight for survival..ISR

పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్- ఇజ్రాయెల్ కు జరుగుతున్న యుద్ధం రెండో దశలోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శనివారం టెల్ అవీవ్లో మీడియాతో వెల్లడించారు. గాజాలో హమాస్ కు వ్యతిరేకంగా తమ దళాలు రెండో దశ యుద్ధాన్ని ప్రారంభించాయని తెలిపారు. శత్రువును భూమి పైనా, కిందా అంతమొందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. 

హమాస్ తో యుద్ధాన్ని ఇజ్రాయెల్ మనుగడ కోసం చేస్తున్న పోరాటంగా అభివర్ణించిన ప్రధాని.. గాజాలో రెండో దశ గ్రౌండ్ ఆపరేషన్ సుదీర్ఘమైనది, కఠినమైనది అని అన్నారు. ప్రస్తుతం తాము కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నామని, అది ముగుస్తుందనడంలో తనకు ఎలాంటి సందేహమూ లేదని అన్నారు. తాము విజేతలం అవుతామని, తామే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బందీలను వారి కుటుంబ సభ్యులతో కలిపేందుకు ఉన్న ప్రతీ అవకాశాన్ని ఇజ్రాయెల్ ఉపయోగించుకుంటుందని నెతన్యాహు చెప్పారు. ఇజ్రాయెలీలు, ఇతర జాతీయులను కిడ్నాప్ చేయడం అమానవీయ నేరమని అన్నారు. ఐడీఎఫ్ నైతిక సైన్యం అని, ఇది పోరాటం చేయని వారికి హాని చేయదని స్పష్టం చేశారు. ఉత్తర గాజా వాసులు ఈ ప్రాంతానికి దక్షిణంగా వెళ్లాలని ఇజ్రాయెల్ ప్రధాని పునరుద్ఘాటించారు.

కాగా.. ఇరు దేశాల దళాలు భీకర యుద్ధ కొనసాగిస్తుండటంతో ఉత్తర గాజా రణ రంగంగా మారింది. అయితే ఇజ్రాయెల్ ప్రతీకార దాడి ప్రారంభించినప్పటి నుంచి గాజాలో అల్లర్లు చెలరేగిన ప్రాంతంలో మృతుల సంఖ్య 8,000 దాటిందని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఇదిలావుండగా అక్టోబర్ 7న హమాస్ ఆకస్మిక, అపూర్వ దాడి కారణంగా ఇజ్రాయెల్లో మరణించిన వారి సంఖ్య 1,400 గా ఉంది.

గాజా స్ట్రిప్ లో హమాస్ పై ఇజ్రాయెల్ ప్రతీకార చర్యపై అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత టర్కీ నుంచి తమ దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఒక ర్యాలీలో, ఒక గంటపాటు సాగిన ప్రసంగంలో ఎర్డోగాన్.. ఇజ్రాయిల్ ను యుద్ధ నేరస్తుడు, ఆక్రమణ దారుడు అంటూ అభివర్ణించాడు. అదే సమయంలో హమాస్ ఒక ఉగ్రవాద సంస్థ కాదని చెప్పారు. కాగా.. ఇజ్రాయెల్ కు పాశ్చాత్య దేశాలు బేషరతుగా మద్దతు ఇస్తున్నాయని టర్కీ అధ్యక్షుడు విమర్శించారు. 2022లో రాయబారులను తిరిగి నియమించడానికి అంగీకరించిన తరువాత దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సంబంధాలను సవరించడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ఈ పరిణామం ఎదురుదెబ్బ.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios