ఇథియోపియా దేశంలో తాజాగా ఉగ్రవాదులు వరస దాడులు జరిపారు. కాగా.. ఈ దాడుల్లో 90మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇథియోపియాలోని పశ్చిమ బెనిషాంగుల్ గుముజ్ ప్రాంతీయ రాష్ట్రంలో ఉగ్రవాదులు జరిపిన వరుస దాడుల్లో 90 మంది పౌరులు మరణించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 

బెకుజీ, కెబెల్లె, బులెన్ వెరెడా, మెటెకెల్ జోన్లలో ఉగ్రవాదులు అమ్తారా సంఘం సభ్యులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. ఈ దాడుల్లో 90 మంది మరణించారని, ఉగ్రవాదులు ఇళ్లను దహనం చేశారని ప్రత్యక్షసాక్షి ఒకరు చెప్పారు. స్థానికులు దాడుల గురించి ఇథియోపియా భద్రతా దళాలకు సమాచారం అందించినా వారు ఉగ్రవాదులు వెళ్లిన తర్వాతే ఆలస్యంగా సంఘటన స్థలానికి వచ్చారని మరో ప్రత్యక్ష సాక్షి చెప్పారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉన్నతాధికారులు ఈ ఘటనపై సమీక్షిస్తున్నారు.