USA: ఏ దేశ అధ్యక్షుడినైనా ట్రంప్ అరెస్ట్ చేయొచ్చా.? ఇంతకీ ఆ హక్కు ఎవరిచ్చారు.?
USA: వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేరే దేశాధ్యక్షుడిని అరెస్ట్ చేసే హక్కు ట్రంప్‌కి ఎక్కడి నుంచి వచ్చిందన్న చర్చ మొదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రంప్ ఇతర దేశాల అధ్యక్షులను అరెస్ట్ చేయించగలరా?
అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలో శక్తివంతమైన నాయకుడిగా గుర్తింపు పొందినా, ఆయన చట్టానికి అతీతుడు కాదు. ముఖ్యంగా ఇతర దేశాల అధ్యక్షుల విషయంలో ఆయనకు నేరుగా అరెస్ట్ చేయించే అధికారం ఉండదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రతి దేశాధ్యక్షుడికి ప్రత్యేక రక్షణ ఉంటుంది.
అంతర్జాతీయ చట్టాల్లో అధ్యక్షులకు ఉన్న రక్షణ ఏంటి?
ఏ దేశంలో అధికారంలో ఉన్న అధ్యక్షుడైనా Head of State Immunity అనే చట్టపరమైన రక్షణ పొందుతాడు. అర్థం ఏమిటంటే, ఒక దేశంలో ఉన్న అధ్యక్షుడిని మరో దేశం సాధారణ క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ చేయలేరు. అమెరికా కూడా ఈ అంతర్జాతీయ వ్యవస్థను పాటించాల్సిందే.
అమెరికా అధ్యక్షుడికి ఉన్న అసలైన శక్తి ఏంటి?
అమెరికా అధ్యక్షుడికి నేరుగా అరెస్ట్ చేయించే అధికారం లేకపోయినా, పరోక్షంగా ప్రభావం చూపే శక్తులు ఉంటాయి. ఉదాహరణకు ఆర్థిక ఆంక్షలు విధించడం, విదేశీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేయించడం, వీసాలు రద్దు చేయడం, అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశాన్ని ఒంటరిగా చేయడం వంటి చర్యలతో ఒక దేశాధ్యక్షుడిపై తీవ్ర ఒత్తిడి తీసుకురాగలడు.
నికోలస్ మాదురో కేసు ఎందుకు భిన్నం?
వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా చట్టబద్ధ అధ్యక్షుడిగా గుర్తించదు. 2018 ఎన్నికల్లో భారీ అవకతవకలు జరిగాయని వాషింగ్టన్ ఆరోపించింది. ఈ కారణంతో ఒక దశలో ప్రతిపక్ష నేత జువాన్ గ్వైదోను తాత్కాలిక అధ్యక్షుడిగా అమెరికా గుర్తించింది. మాదురోను అధ్యక్షుడిగా అంగీకరించకపోతే, ఆయనకు అధ్యక్షుల రక్షణ వర్తించదనే వాదనను అమెరికా వినిపిస్తోంది.
అమెరికా నిజంగా ఏ దేశాధ్యక్షుడినైనా అరెస్ట్ చేయగలదా?
అమెరికా గానీ, మరో దేశం గానీ అధికారంలో ఉన్న విదేశీ అధ్యక్షుడిని చట్టబద్ధంగా అరెస్ట్ చేయలేవు. అది సాధ్యమయ్యే సందర్భాలు.. ఆ వ్యక్తి అధికారంలో లేకపోతే, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆదేశాలు ఉంటే, స్వదేశం ఆ వ్యక్తి రక్షణను ఉపసంహరించుకుంటే. మాదురో విషయంలో అమెరికా ఈ చట్టపరమైన చిక్కులను ఉపయోగించి చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది.

