రష్యాలో దుండగుల కాల్పులు: 40 మంది మృతి, 145 మందికి గాయాలు
మాస్కోలో దుండగులు జరిపిన కాల్పుల్లో 40 మంది మృతి చెందారు. ఈ ఘటనను ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు.
మాస్కో: రష్యాలోని మాస్కో సమీపంలో మ్యూజికల్ నైట్ లో దుండగులు జరిపిన దాడిలో 40 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 145 మంది గాయపడ్డారు. రష్యాలో ఈ ఘటనను అత్యంత దారుణమైన ఘటనగా భావిస్తున్నారు.
రాక్ గ్రూప్ పిక్నిక్ మాస్కోకు పశ్చిమాన ఉన్న క్రోకస్ సిటీ హాల్ లో జరిగిన సంగీత కచేరి పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ సంగీత కచేరి కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చిన వారిలో 40 మంది మృతి చెందారు. మరో 145 మందికిపైగా గాయపడ్డారు. క్రోకస్ సిటీ హాల్ లో 6,200 మంది కూర్చొనే వీలుంది. దుండగులు కాల్పులు జరుపుతున్న సమయంలో సంగీత కచేరి వీక్షించేందుకు వచ్చిన వారు భయంతో కేకలు వేశారు. దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపినట్టుగా స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.
కాల్పుల శబ్దం రావడంతో కొందరు భయపడ్డారు. అయితే దుండగులు కాల్పులకు దిగిన విషయాన్ని గుర్తించిన వారంతా అక్కడి నుండి బయటకు వెళ్లేందుకు పరుగులు తీశారు.ఈ సమయంలో తొక్కిసలాట కూడ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 40 మంది మృతి చెందితే , 145 మంది గాయపడ్డారని పోలీసులు ప్రకటించారు.
అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు.దుండగులు తెల్లరంగు కారులో వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు.